అసెంబ్లీకి టీషర్ట్‌లో వచ్చిన ఓ ఎమ్మెల్యేను సభ నుంచి బయటకు పంపేశారు గుజరాత్ శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది. సోమవారం జరిగిందీ ఘటన.
రాష్ట్రంలోని సోమనాథ్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చుడాస్మ.. గతవారం అసెంబ్లీకి టీషర్ట్, ప్యాంట్ వేసుకుని వచ్చారు. అయితే మరోసారి ఇలా రావొద్దని.. ఎమ్మెల్యేలు అసెంబ్లీ మర్యాద పాటించాలని స్పీకర్ అప్పుడే హెచ్చరించారు. అయితే సోమవారం కూడా విమల్ మళ్లీ టీషర్ట్ ధరించే సభకు హాజరవడం వల్ల.. స్పీకర్ త్రివేది అసహనం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. షర్ట్ లేదా కుర్తా వేసుకుంటేనే అసెంబ్లీకి రావాలని సూచించారు.
నిబంధనలు పాటించాల్సిందే..
స్పీకర్ ఆదేశాలపై అసంతృప్తికి గురైన విమల్.. సభలో వాదనకు దిగారు. "ఇదే టీషర్ట్‌తో నేను ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించాను. ప్రజలు నాకు ఓటేసి అసెంబ్లీకి పంపారు. మీరు(స్పీకర్) మా ఓటర్లను అగౌరవపరుస్తున్నారు" అని అన్నారు. దీంతో స్పీకర్ స్పందిస్తూ.. "మీ ఓటర్లను ఎలా కలిశారన్నది నాకు తెలియదు. కానీ మీరు స్పీకర్ ఆదేశాలను అగౌరవపరుస్తున్నారు. ఎమ్మెల్యే అయినంతమాత్రాన మీకు నచ్చినట్లుగా సభకు రావడానికి కుదరదు. ఇదేం ప్లేగ్రౌండ్ కాదు. అసెంబ్లీ నిబంధనలు పాటించాలి. షర్ట్, కుర్తా లాంటి ఫార్మల్ దుస్తులు వేసుకుంటేనే సభకు రండి" అని గట్టిగా చెప్పారు. దీంతో ఎమ్మెల్యే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అనంతరం.. స్పీకర్‌తో వాదన పెట్టుకున్న ఎమ్మెల్యే విమల్‌ను మూడు రోజుల పాటు సభ నుంచి బహిష్కరించాలంటూ భాజపా మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా స్పీకర్ ముందు ప్రతిపాదన చేశారు. అయితే ఈ ప్రతిపాదనను సీఎం విజయ్ రూపానీ వెనక్కి తీసుకున్నారు. "మన మంత్రి ఒకరు కూడా టీషర్ట్ వేసుకునేవారు. అయితే స్పీకర్ చెప్పిన తర్వాత ఆయన తన డ్రెసింగ్ స్టైల్‌ను మార్చుకున్నారు. సభకు టీషర్ట్‌లలో రావడం అంత బాగుండదు. ఈ విషయంలో విమల్‌కు కాంగ్రెస్ నేతలు సర్దిచెప్పాలి" అని ముఖ్యమంత్రి కోరారు.
ఇదీ చూడండి: 'రాముడితో సమానంగా మోదీని చూస్తారు'