సాధారణంగా రాజకీయ నాయకలకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తాము బరిలో దిగే స్థానాల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు. కొందరు నాయకులు.. తమ పర్సనల్ లైఫ్‌ను పక్కనపెట్టి మరీ రాజకీయాల్లో బిజీ అయిపోతుంటారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్ చెందిన ఓ నాయకుడు.. ఎన్నికల్లో తన హవా చూపించేందుకు మరికొద్ది గంటల్లో వివాహం చేసుకుంటున్నారు! అదేంటి?.. ఎన్నికలకు.. వివాహనికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా?.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
రాంపుర్ మున్సిపాలిటీ ఎన్నికలు.. మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికలు అధికారులు విడుదల చేశారు. నామినేషన్ వేయడానికి ఏప్రిల్ 17వ తేదీని ఆఖరి గడువుగా ప్రకటించారు. అయితే రాంపుర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామూన్ షా ఖాన్(45).. మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనుకున్నారు. అందుకు కొన్ని నెలల ముందు నుంచే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో మున్సిపాలిటీ అధ్యక్ష పదవి సీటు.. మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన నిరాశచెందారు. ఎలా అయినా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అప్పుడే ఆయనకు తన అనుచరులు ఓ సలహా ఇచ్చారు.
వివాహాం చేసుకుని.. మామూన్ ఖాన్ భార్యను అధ్యక్ష పదవికి పోటీలో దించమని కోరారు. వెంటనే అంతా.. మామూన్ కోసం వధువును వెతికారు. 45 గంటల్లోనే కాంగ్రెస్ నేతకు వివాహ సంబంధం ఖరారైంది. వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. మామూన్ షా ఖాన్.. వివాహం ఏప్రిల్ 15న ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించిన పెళ్లి కార్డు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాహం జరిగిన వెంటనే మామూన్ భార్య నామినేషన్ దాఖలు చేస్తారట.
మున్సిపాలిటీ అధ్యక్ష పదవి మహిళలకు కేటాయించినందుకే.. 45 ఏళ్ల వయస్సులో తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నాయకుడు మమూన్ షా ఖాన్.. ఈటీవీ భారత్‌కు తెలిపారు. తాను చాలా కాలంగా విద్యార్థి రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి రాంపుర్ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటానని.. సామాజిక సేవ వల్ల పెళ్లికి సమయం దొరకలేదని అన్నారు. తన జీవితంలో అనేక మార్లు రక్తదానం చేశానని వెల్లడించారు. పల్స్ పోలియా కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించినట్లు వివరించారు. తనను పెళ్లి చేసుకోవాలని మద్దతుదారులు సలహా ఇచ్చారని.. అందుకు తాను అంగీకరించినట్లు చెప్పారు. తన పెళ్లికి రాంపుర్ ప్రజలంతా వచ్చి ఆశీర్వదించాలని కోరారు.