కేంద్రం, రైతుల మధ్య చర్చలు ఫలించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని అన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. కర్షకులతో భేటీ ఫలప్రదం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. వ్యవసాయ చట్టాలు ఏళ్లుగా ఉన్న రైతుల డిమాండ్ ఆధారంగా తీసుకొచ్చినవేనని తెలిపారు.
"చర్చలు సఫలం కావాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదు. రైతుల సమస్యలు పరిష్కారమవడం ఆ పార్టీకి ఇష్టం లేదు. అందుకే వాటిని అడ్డగించడానికి జిత్తులు పన్నుతోంది. కాంగ్రెస్‌ది కుటుంబ పాలన అయితే మోదీ పాలనలో అధికారం ప్రజల చేతుల్లో ఉంది."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
కర్షకులతో పదో విడత చర్చలు బుధవారం (జనవరి 20) జరగనున్నాయి. సాగు చట్టాలను విమర్శిస్తూ మంగళవారం మీడియా సమావేశంలో కేంద్రంపై ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. 'ఖేతీ కా ఖూన్' (రక్తసిక్తమైన వ్యవసాయం) అనే బుక్లెట్నూ విడుదల చేశారు. ధరలు, చైనా దురాక్రమణ సహ పలు అంశాలపై ప్రభుత్వాన్ని ట్విట్టర్లో రాహుల్ నిలదీశారు. దీనిపై ఘాటుగా స్పందించారు జావడేకర్.
"వారికి రక్తం అంటే చాలా ఇష్టం. దేశ విభజన, సిక్కుల వ్యతిరేక అల్లర్లు, భగల్పుర్ ఆందోళనలతోనే ఆ విషయం రుజువైంది. కాంగ్రెస్ విధ్వంస విధానాల వల్లే రైతులు ఇబ్బందుల పాలయ్యారు. భాజపా హయాంలో అన్నదాతలకు రూ.7లక్షల కోట్లకు పైగా అందజేశాం. ఆహార ధరలు పెరిగాయని మాట్లాడుతున్నారు. 80 కోట్లకు పైగా జనాభాకు రూ.2లకే గోధుమ, రూ.3లకే బియ్యం మా ప్రభుత్వం అందజేస్తోంది."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
భారత్‌లోకి చైనా దురాక్రమణపై రాహుల్ విమర్శలను తిప్పికొట్టారు జావడేకర్. "చైనాపై వారు ఎందుకు సమాధానం చెప్పరు? ఆ దేశానికి మన భూభాగాన్ని ఇచ్చింది ఎవరు? ఎవరి పాలనలో భారత్ నుంచి ఆక్సాయిచిన్ చైనా చేతుల్లోకి వెళ్లింది? ప్రైవేటు ట్రస్టు కోసం ఆ దేశం నుంచి డబ్బులు స్వీకరించింది ఎవరు? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించింది ఎవరు?" అని కేంద్రమంత్రి ప్రశ్నించారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయ రంగం నాశనానికే ఆ చట్టాలు'