Rahul Gandhi chintan shivir: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా యాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. చింతన్ శిబిర్ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. పార్టీని బలోపేతం చేయాలంటే దగ్గరి దారులు ఉండవని తెలిపారు. నేతలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తుదిశ్వాస వరకు వెంట ఉంటానని భరోసా ఇచ్చారు.
"స్వాతంత్ర్యం పూర్వం నుంచి ఇప్పటివరకు ప్రజలతోనే మమేకమై ఉన్నాం. దేశంలో మరే ఇతర పార్టీకి ఇంత సుదీర్ఘ చరిత్ర లేదు. ప్రస్తుతం కాంగ్రెస్కు ప్రజలతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయన్న విషయాన్ని మనం అంగీకరించాలి. ఈ సంబంధాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. నేరుగా ప్రజలతోనే సంబంధం అనేది కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది. అక్టోబర్లో ప్రజల్ని కలబోతున్నాం. యాత్ర నిర్వహించి సంబంధాలను బలోపేతం చేసుకోబోతున్నాం. దీనికి ఎలాంటి షార్ట్కట్లు లేవు. కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యం. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భయపడాల్సిన అవసరం లేదు. నా జీవిత చరమాంకం వరకు మీతోనే ఉంటా. ఈ పోరాటంలో మీతో కలిసి నడుస్తా. కాంగ్రెస్ పార్టీకి ఇకపై ఏం చేయాలో తెలుసు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
చింతన్ శిబిర్లో చర్చలు విస్తృతంగా జరగడాన్ని ప్రశంసించారు రాహుల్ గాంధీ. నేతలంతా సూటిగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఇలాంటివి జరగనివ్వవని అన్నారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు.
"నేతలంతా తమ భావాలను సూటిగా చెప్పారు. ఎటువంటి భయాలు లేకుండా చర్చలకు కాంగ్రెస్ వేదిక కల్పించింది. భాజపా, ఆర్ఎస్ఎస్ ఇలాంటి వాటిని అనుమతించవు. ఇప్పుడు దేశంలో ఎవరినీ మాట్లాడనీయకుండా చేస్తున్నారు. భాజపాలో మైనార్టీలు, దళితులకు సరైన స్థానమే లేదు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. దీనంతటికీ భాజపా ప్రభుత్వానిదే బాధ్యత."
-రాహుల్ గాంధీ
ఈ సందర్భంగా దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా మరోసారి పేర్కొన్నారు రాహుల్. రాష్ట్రాల కలయికతోనే కేంద్రం ఏర్పడిందని రాజ్యాంగం చెప్తోందన్నారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: