బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కరోనా బారిన పడిన ఆ పార్టీ అభ్యర్థి రెజాల్ హక్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ముర్షిదాబాద్ జిల్లాలోని శంషేర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు హక్. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. తొలుత బుధవారం జంగిపుర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు హక్. బుధవారం రాత్రి ఆరోగ్యం క్షీణించగా.. మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాకు తరలించారు. గురువారం తెల్లవారు జామున 5 గంటలకు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఏడో విడతలో భాగంగా శంషేర్‌గంజ్ నియోజకవర్గంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
కాంగ్రెస్ సంతాపం..
కాంగ్రెస్ అభ్యర్థి రెజాల్ హక్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు ఆ పార్టీ నేత అధిర్ రంజన్ ఛౌదరి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: రెండుసార్లు మరణించి బతికొచ్చిన కొవిడ్ రోగి!