దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై కేంద్ర ప్రభుత్వం రాజీ పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తింది. సరిహద్దులో ఎప్పటి నుంచి యథాతథ స్థితి ఉంటుందో చెప్పకుండానే లద్దాఖ్‌లో బలగాలను ఉపసంహరిస్తున్నారని పేర్కొంది. ఎల్ఏసీని భారత్‌కు ప్రతికులంగా మార్చేలా.. పాంగాంగ్ సో సరస్సు వద్ద మాత్రమే బలగాల ఉపసంహరణకు ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించింది.
"భారత ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో విఫలమైన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వారి అసమర్థత గురించి వివరించగలరా? చైనా అనే పదాన్ని ప్రస్తావించేందుకే ప్రధాని మోదీ భయపడతారు. మరోవైపు, భారత భూభాగం నుంచి చైనా బలగాల ఉపసంహరణపై సరైన సమాచారం ఇవ్వకుండా దేశ ప్రజలను రక్షణ మంత్రి తప్పుదోవపట్టిస్తున్నారు."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణపై భారత్-చైనా మధ్య ఒప్పందం కుదిరిందని పార్లమెంట్ వేదికగా రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. విడతలవారిగా, క్రమ పద్ధతిలో సైన్యాన్ని వెనక్కి పిలుస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో ఈ అంశంపై రాజ్‌నాథ్ ప్రకటన చేయగా.. దీనిపై మరింత వివరణ కావాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కోరాయి. అయితే ఇది సున్నితమైన దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఛైర్మన్ వెంకయ్యనాయుడు అందుకు అనుమతించలేదు.
'సమాధానం చెప్పాలి'
అయితే, దేశ భద్రతపై ఆటలు తగదని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హితవు పలికారు. ఈ అంశంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై విమర్శలు చేశారు సుర్జేవాలా. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల అన్యాయంగా భారత్‌పై దురాక్రమణదారు అనే ముద్ర వేసే అవకాశం చైనాకు లభించినట్లైందని అన్నారు. మోదీ, రాజ్‌నాథ్ దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు.
ఇదీ చదవండి: 'బలగాల ఉపసంహరణపై భారత్- చైనా ఏకాభిప్రాయం'