ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఓ కాంపౌండర్ కిడ్నాప్ డ్రామా విఫలమైంది. తన యజమాని నుంచి డబ్బులు లాగాలని నిందితుడు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
మేరఠ్‌లోని అనుదేవ్ నర్సింగ్ హోమ్‌లో ఐదేళ్లనుంచి కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు తప్రాజ్. ఆ ఆసుపత్రి యజమాని డాక్టర్ ఎస్పీ సింగ్.. కుటుంబంతో సహా నర్సింగ్ హోమ్ ఉన్న భవనంలోని రెండో అంతస్తులో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ట్యాంక్‌లో నీళ్లు చూసేందుకు వెళ్లిన కాంపౌండర్ కిడ్నాప్ డ్రామా ఆడాడు.
డా. ఎస్పీ సింగ్ ఇద్దరు కుమార్తెలను కత్తితో బెదిరించి వారిద్దరినీ ఓ గదిలో బంధించాడు తప్రాజ్. తర్వాత రూ.ఐదు లక్షలు కావాలంటూ ఎస్పీ సింగ్‌కు ఫోన్ చేశాడు. గదిలోని బీరువా తాళం ఇవ్వాలని బెదిరించాడు. వెంటనే తాను చెప్పింది చేయకపోతే ఇద్దరు కుమార్తెలను హతమార్చుతానని అన్నాడు.
వెంటనే గంగానగర్ పోలీసులకు సమాచారం అందించారు ఎస్పీ సింగ్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి తప్రాజ్ను అరెస్టు చేశారు.
అప్పుల బాధ వల్లే..
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తనకు వివాహం జరిగిందనట్లు తెలిపిన తప్రాజ్.. ఈ కిడ్నాప్ డ్రామా ఆడేందుకు కారణమేంటో వివరించాడు. తన తల్లి ఆరోగ్యం విషమించిన కారణంగా 8 లక్షల వరకు అప్పు అయిందని పోలీసుల విచారణలో చెప్పాడు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నాడు.