Coal Theft Viral Video: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా గనుల్లో బొగ్గు దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కేజీయఫ్ పార్ట్ 3 అనే హాష్ ట్యాగ్ జోడించి నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ నెటిజన్లు మాత్రం కోర్బా బొగ్గు గనిలోనిదే అని షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు.
విచారణకు ఆదేశించిన ఐజీ.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బిలాస్‌పుర్ డివిజన్‌కు చెందిన ఐజీ రతన్‌లాల్ డాంగి.. విచారణకు ఆదేశించారు. దర్యాప్తు బాధ్యత బిలాస్‌పుర్‌లోని యాంటీ క్రైమ్ &సైబర్ యూనిట్‌కు అప్పగించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాయగడ, కోర్బా ఎస్పీలను కూడా ఆదేశించారు. అయితే ఇదే సమయంలో కొందరు అధికారులను సైతం బదిలీ చేయడం గమనార్హం.
ఈ అంశాలపై విచారణకు ఆదేశించిన బిలాస్‌పుర్ ఐజీ..
- వైరల్ అవుతున్న ఈ వీడియో ఏ గని, ఏ జిల్లాకు చెందినది?
- ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు గనిలోకి ప్రవేశిస్తుంటే.. అక్కడ మోహరించిన సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎందుకు ఆపలేకపోయింది?
- SECL(సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్) గనుల భద్రతలో కేంద్ర భద్రతా బలగాలు, జిల్లా పోలీసుల మధ్య సమన్వయం ఎలా ఉంది?
- గతంలో బొగ్గు చోరీపై అధికారులు పోలీస్స్టేషన్లకు ఫిర్యాదు చేయగా, దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- చర్యలు తీసుకోకపోతే కారణాలేంటి?
- దొంగిలించిన ఈ బొగ్గును కొనుగోలు చేసిన వారెవరు?
- దొంగిలించిన బొగ్గును ఎవరికి పంపుతున్నారు?
- ఈ బొగ్గు దొంగతనం కేసులో ఎవరైనా అధికారి/ఉద్యోగి ప్రమేయం ఉందా?
వీడియోలో ఏముంది?... వైరల్ అవుతున్న ఆ కోల్ మైన్ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇక, ఆ వీడియోకు కేజీయఫ్ చిత్రానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను యాడ్ చేశారు. దీంతో మరింత వైరలైంది. గనుల నుంచి బొగ్గును తీసుకువెళుతున్న వందల వేల మంది ప్రజలను మనం చూడొచ్చు. ఇంతకీ ఇది ఎవరి వీడియో? ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు గనిలోకి ఎలా ప్రవేశించారనేది పెద్ద ప్రశ్న?
ఈ వీడియోపై ట్వీట్ చేసిన భాజపా నేత.. వైరల్ అవుతున్న ఆ వీడియోను తాజాగా ఆ రాష్ట్ర భాజపా నాయకుడు ఓపీ చౌదరి ట్వీట్ చేశారు. "ఈ వీడియో కోర్బా గనులదే. ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గని అయిన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో ఉన్న గెవ్రా మైన్స్లోనివే ఈ దృశ్యాలు. మాఫియా రాజ్‌ల ఓపెన్ గేమ్ ఇది. వేలాది మంది కార్మికులు, వందలాది వాహనాల ద్వారా బొగ్గును బహిరంగంగా దొంగిలిస్తున్నారు" అని రాసుకొచ్చారు.
దేశంలో 20 శాతం బొగ్గు అక్కడినుంచే.. కోల్ ఇండియా లిమిటెడ్‌లో కోర్బా గనులు అతిపెద్దవి. దేశానికి దాదాపు 20 శాతం బొగ్గు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. సంవత్సరానికి SECL ఉత్పత్తి లక్ష్యం 120 మిలియన్ టన్నులు. అయితే ఈ గనుల్లో బొగ్గు దొంగతనాలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇక, ఈ వీడియోపై దర్యాప్తు పూర్తయ్యాక అసలు నిజాలు బయపడనున్నాయి.
ఇవీ చదవండి: భార్యతో గొడవ.. సిలిండర్ పేల్చుకుని భర్త మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు
గాల్లో ఉండగా ఇంజిన్ బంద్.. 'టాటా' ఫ్లైట్‌కు తప్పిన పెనుముప్పు