KCR Review on Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సచివాలయంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, తదితరులు ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో ఈ లోగోను రూపొందించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీహబ్, పాలపిట్ట, బోనాలు, ఉచిత విద్యుత్, రైతుబంధు, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, బతుకమ్మ తదితరాలకు లోగోలో ప్రాధాన్యత కల్పించారు.
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. గంగా జమున తెహజీబ్‌కు నిలయమైన తెలంగాణలో.. విభిన్న మతాలు, సంస్కృతుల ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రకృతి అందించిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో.. 75 ఏండ్లుగా దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. వ్యవసాయాధారిత భారతదేశంలో కేంద్ర పాలకులకు దార్శనికత లేకపోవడంతో..తద్వారా రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.
దేశానికే రోల్ మోడల్‌గా : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇవాళ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలందరి సహకారంతో దేశవ్యాప్తంగా ఈ అభివృద్ధిని పరిచయం చేస్తామని ఆయన వివరించారు. అంతకుముందు జైన మతపెద్దలు కేసీఆర్‌ను కలిశారు. మైనార్టీ కమిషన్‌లో చోటు కల్పించడంతో పాటు.. జైన భవన్‌కు ఉప్పల్ భగాయత్‌లో రెండెకరాల స్థలం కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు మాసబ్‌ట్యాంకులో మహావీర్ ఆస్పత్రి లీజును ఎత్తివేస్తూ స్థలాన్ని ఉచితంగా తమకు కేటాయించినందుకు వారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో.. రామరాజ్యాన్ని తలపిస్తోందని జైన మతపెద్దలు పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో ఎన్నడూ లేని విధంగా.. అత్యంత సమర్థంగా శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహిస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథాన నడుస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని జైన మతపెద్దలు వెల్లడించారు.
ఇవీ చదవండి: CM KCR Review దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలి
Harish Rao on Job Notification : 'త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ'
గంగా నదికి పూజ చేసేందుకు వెళ్తుండగా బోటు బోల్తా.. నలుగురు మహిళలు మృతి