చిన్న వయసులోనే ఈ-సైకిల్ తయారు చేయాలని కలలు కన్నాడు. అయితే ఈ-సైకిల్ చేసినప్పటికీ.. దాని స్పీడ్‌ను అదుపు చేయడంలో విఫలయ్యాడు. ఫలితంగా ఓ కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లి.. 'ఈ-బైక్' తయారు చేయడంలో సఫలమయ్యాడు దిల్లీకి చెందిన 9వ తరగతి విద్యార్థి రాజన్. పాడైపోయిన రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ విడిభాగాలను పోగు చేసి ఈ-బైక్‌ను తయారు చేయడం గమనార్హం. చిట్టి చేతులతోనే అద్భుతాన్ని చేసి చూపించాడు రాజన్.
సుభాష్ నగర్‌లోని సర్వోదయ బాల్ విద్యాలయలో చదువుతున్న రాజన్.. మూడు రోజుల్లోనే ఈ-బైక్ తయారు చేసి అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టేశాడు. మూడు నెలల పాటు పాడైపోయిన ఎన్ఫీల్డ్ భాగాలను సేకరించి.. అతి తక్కువ వ్యయంతో ఈ-బైక్‌ను తయారు చేయగలిగాడు.
"బైక్ తయారీకి సంబంధించిన వస్తువులను సేకరించడానికి మూడు నెలలు పట్టింది. తర్వాత మూడు రోజుల్లో ఈ బైక్ తయారు చేశా. లాక్డౌన్ మొదలయ్యాక స్కూల్ ఉండేది కాదు. ఆ సమయంలో నేను బైక్ షాపులో సమయం గడిపేవాడిని. మా ఇంటి సమీపంలో ఓ మోటార్ రిపేర్ షాపు ఉంది. ఆ షాపు యజమానిని.. ఆర్పీఎమ్ స్పీడ్ వంటి విషయాలు అడిగి తెలుసుకున్నాను. బైక్ మోటార్‌కు ఎంత ఆర్పీఎమ్ స్పీడ్ అవసరమో అంచనా వేశాను. తర్వాత నాన్నకు మోటార్ కొనమని చెప్పాను."
--రాజన్, విద్యార్థి.
ఈ ఈ-బైక్ తయారు చేయడానికి రూ. 45 వేలు ఖర్చు చేసినట్లు రాజన్ తెలిపాడు. తొలుత.. ఈ-బైక్ తయారు చేయగలననే విశ్వాసం తన తండ్రికి ఉండేది కాదని రాజన్ పేర్కొన్నాడు. కానీ, రాజన్ తల్లి మాత్రం అతనిపై పూర్తి నమ్మకం ఉంచేదని అన్నాడు.
"చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్ వస్తువులతో ఆడుకోవడం అంటే రాజన్‌కు చాలా ఇష్టం. టీవీ మొదలైన వస్తువులను తెరిచి చూస్తుంటాడు. అందులో ఏముంది, ఎలా ఉంటుంది అని తెలుసుకునేవాడు. ఇది ఓ హాబీలా మార్చుకున్నాడు. అనంతరం ఈ-బైక్ చేయడం నేను వద్దన్నాను. కానీ, వాళ్ల స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్‌గా ఇది చేయమన్నారని నాకు అబద్దం చెప్పాడు. నేను రాజన్‌కు ఏమీ సహకరించలేదు కానీ.. అతడు ఈ బైక్ చేసి చూపించాడు."
--దశరథ్ శర్మ, రాజన్ తండ్రి.
రాజన్ ఈ-బైక్ చేయడంపై అతనికి చదువు చెప్పిన గురువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమైనా సహకారం అందిస్తే భవిష్యత్తులో అతడు మరింతగా రాణిస్తాడని అంటున్నారు.
ఇదీ చదవండి: