సుప్రీంకోర్టు కార్యకలాపాలు అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. సుప్రీంలోని సహచర న్యాయమూర్తులతో దీనిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఏకాభిప్రాయంతో రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.
సుప్రీంకోర్టు కార్యకలాపాలను తెలుసుకునే విధంగా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను జస్టిస్ రమణ ఆవిష్కరించారు. జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్‌తో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన వెనుక ఉన్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సుప్రీంకోర్టు సాంకేతిక బృందం కేవలం మూడు రోజుల్లోనే దీన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు.
జర్నలిస్టుగా జస్టిస్ రమణ!
మీడియాకు, సుప్రీంకోర్టుకు మధ్య వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు జస్టిస్ రమణ. ఈ సందర్భంగా జర్నలిస్టుగా తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
"ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ఇబ్బందికరమైన ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు మాకు తెలుసు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇక నుంచి జర్నలిస్టులు కోర్టు కార్యకలాపాల విషయంలో సమస్యలు ఎదుర్కోకూడదనే ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాం. కోర్టులో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించాం."
-జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి
జర్నలిస్టుల అక్రిడేషన్ల మంజూరులో ఎవరికీ అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని సీజేఐ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కొవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి సీజేఐ సహా ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: 'స్టెరిలైట్' నుంచి ఆక్సిజన్ సరఫరా షురూ