ప్రేరేపిత, లక్షిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించేందుకు న్యాయమూర్తులకు లాయర్లు సహకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు(justice ramana speech). ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి, పౌరుల్లో విశ్వాసం నింపేందుకు కృషి చేయాలని సూచించారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. జడ్జీలు, లాయర్లు అందరూ ఒక కుటుంబానికి చెందినవారేనని పేర్కొన్నారు.
"జడ్జీలకు, న్యాయవ్యవస్థకు మీరు(న్యాయవాదులు) సహకరించాలి. మనం అందరం ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. ప్రేరేపిత, లక్షిత దాడుల నుంచి ఈ వ్యవస్థను రక్షించండి. మంచివైపు నిలబడేందుకు వెనకాడకండి. చెడుపై పోరాటం చేయడం మానకండి."
--- జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి.
ఆమోదం పొందిన నాటితో పోల్చుకుంటే.. రాజ్యాంగం ఇప్పుడు మరింత విలువలతో కూడుకుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. కోర్టు లోపల, బయట జరిగిన చర్చలు ఇందుకు కారణమన్నారు. చర్చలకు ఒక రూపాన్ని ఇవ్వడమే.. భారత రాజ్యాంగం అతి ముఖ్యమైన లక్షణం అని తెలిపారు. చర్చలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజల సంక్షేమం మెరుగుపడుతుందని అన్నారు.
'వాళ్లు చట్టసభ్యులు కాకూడదు..'
రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాశ్ సింగ్.. చట్టాన్ని ఉల్లంఘించేవారు చట్టసభ్యుల స్థానానికి చేరకూడదని అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగా చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- భారత రాజ్యాంగంపై ఆన్లైన్ కోర్సు