Civilians killed by Army Nagaland: నాగాలాండ్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మిలిటెంట్లుగా భావించి పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
Misfire on Civilians:
బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్నారు. అయితే, మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఈ పరిణామంతో జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాల వాహనాలను తగులబెట్టారు.
బలగాల పొరపాటు వల్లే ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు జరిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు.
కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ
ఈ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నిర్వహించనున్నట్లు సైన్యం స్పష్టం చేసింది. పౌరులపై కాల్పులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు విచారకరమని పేర్కొంది. భద్రతా సిబ్బంది పలువురికి తీవ్రంగా గాయాలైనట్టు తెలిపింది.
ఘటనకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణెకు అధికారులు వివరించారు.
సీఎం విచారం
ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో విచారం వ్యక్తం చేశారు. పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని దురదృష్టమైన ఘటనగా అభివర్ణించిన ఆయన... దీనిపై సిట్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అన్ని వర్గాలు శాంతియుతంగా ఉండాలని కోరారు.
అమిత్ షా స్పందన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: భారత్‌లో ఒక్కరోజే 2 వేలకుపైగా కరోనా మరణాలు!