CID Searches in Margadarsi Offices: రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో మూడో రోజు సోమవారం కూడా సీఐడీ సోదాలు కొనసాగాయి. మే 1న సెలవు అయినప్పటికీ ఆయా కార్యాలయాల సిబ్బందిని పిలిపించి తమకు అవసరమైన దస్త్రాలను పరిశీలించారు. రాత్రిళ్లు కొంతమంది సిబ్బందిని పంపించేసి మళ్లీ ఉదయాన్నే రమ్మంటున్నారు. కొన్ని చోట్ల పరిశీలన పూర్తి అయ్యేంతవరకు ఉండాలని ఆదేశాలిస్తున్నారు. ప్రధానంగా ఖాతాదారులకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత వివరాలు, ఆడిట్ నివేదికలు, ఇతర దస్త్రాలను ప్రింట్లు తీసుకున్నారు.
పోస్టల్, కొరియర్ ద్వారా వచ్చిన పార్శిళ్లను లోపలకు అనుమతించలేదు. ఎప్పటికప్పుడు సీఐడీ కేంద్ర కార్యాలయంలోని ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వారి ఆదేశాలను పాటిస్తున్నారు. ఖాతాదారులను లోపలకు రానివ్వలేదు. నగదు చెల్లింపులు, ఇతర అవసరాల నిమిత్తం వచ్చిన వారిని వెనక్కి పంపించి వేశారు. కాకినాడలో కొన్ని ఒరిజినల్ దస్త్రాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తణుకు బ్రాంచికి సంబంధించిన న్యాయవాదిని పిలిపించి విచారించారు.
శ్రీకాకుళంలో ప్రతి ఆదివారం జరిగే చిట్ పాటకు సంబంధించిన మినిట్ బుక్స్‌కు సంబంధించిన జిరాక్స్‌లను తీసుకున్నారు. 84 మినిట్స్ పుస్తకాలను ఒక్కొక్కటి 50 పేజీల చొప్పున జిరాక్స్‌లు తీయించారు. ఖాతాదారులు పాటపాడిన తర్వాత నగదు తీసుకున్నప్పుడు పెట్టే సంతకాల పేపర్ల జిరాక్స్‌లూ తీశారు. విజయనగరంలో రెండు రోజులుగా కార్యాలయంలోనే ఉన్న మేనేజరును మూడో రోజు రాత్రి ఇంటికి పంపించారు. తెనాలిలో వేలాది నకళ్లు అడగడంతో కార్యాలయంలో అక్కడ ఉన్న మిషన్ సామర్థ్యం సరిపోక అధికారులు బయట తీయించారు.
సీఐడీ అధికారుల తీరుతో ఖాతాదారులు ఇబ్బంది: మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచిల్లో గత రెండు రోజులుగా సోదాలు చేస్తున్న సీఐడీ అధికారులు, సిబ్బంది.. ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చిట్టీల సొమ్ము చెల్లించడానికి, ఇతర పనులపై మార్గదర్శి కార్యాలయాలకు ఆదివారం వచ్చిన వారిని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వారు ఎందుకొచ్చారో ఆరా తీసి.. వెనక్కి పంపేశారు.
సీఐడీ అధికారుల తీరుతో మార్గదర్శి ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రాంచిల వద్దకు ఖాతాదారులు చిట్టీల వాయిదా సొమ్ము కట్టడానికి వచ్చామని చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదు. పాసు పుస్తకాలు చూపించినా లోపలకు పంపలేదు. కార్యాలయంలో ఆడిట్ జరుగుతోందని, ఇప్పుడు వెళ్లడానికి కుదరదంటూ.. అనుమతి నిరాకరించారు.
రెండు, మూడు రోజుల తర్వాత రావాలని సూచించారు. చిట్టీ వాయిదా సొమ్ము గడువులోగా చెల్లించకపోతే అపరాధ రుసుము పడుతుందని కొందరు చెప్పినా సీఐడీ సిబ్బంది, పోలీసులు వినిపించుకోలేదు. వారి తీరుతో మార్గదర్శి ఖాతాదారులు పలువురు ఇబ్బందులు పడ్డారు. 50 ఏళ్లు దాటిన వారు, పిల్లలతో కలిసి వచ్చినవారు సీఐడీ, పోలీసుల చర్యల వల్ల ఇబ్బందులకు గురయ్యారు.
ఇవీ చదవండి: