చైనా సర్కారు ఇటీవల తీసుకొచ్చిన సరిహద్దు చట్టంపై (China border issue) భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఏకపక్షంగా తీసుకొచ్చిన చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, ఈ చర్యలేవీ సరిహద్దుపై, ఇరుపక్షాల (China India border fight) మధ్య కుదిరిన అవగాహనపై ప్రభావం చూపవని వివరించింది.
చైనా ఇటీవల తీసుకొచ్చిన చట్టంపై (China Border laws) మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులను ఏమార్చే విధంగా చర్యలు తీసుకోవద్దని పొరుగు దేశానికి స్పష్టం చేశారు.
"సరిహద్దు చట్టానికి చైనా ఆమోదం తెలపడాన్ని మేం గమనించాం. విదేశాలతో ఉన్న అవగాహన, కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని చట్టంలో పేర్కొన్నారు. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు. చర్చల ద్వారా ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతల కోసం ఇప్పటికే పలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాం. ఈ నేపథ్యంలో సరిహద్దు ఒప్పందాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న చట్టాన్ని చైనా ఆమోదించడం ఆందోళనకరం."
-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి
చైనా-పాకిస్థాన్ 1963లో చేసుకున్న సరిహద్దు ఒప్పందంపై భారత్కు ఉన్న అభిప్రాయాన్ని నూతన చట్టం తొలగించలేదని బాగ్చి స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని భారత్ ఇప్పటికీ.. అక్రమంగానే భావిస్తోందని చెప్పారు.
చట్టంలో ఏముందంటే?
సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో ఈ నూతన సరిహద్దు చట్టాన్ని చైనా అమల్లోకి తీసుకొచ్చింది. సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు అందులో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ.. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది.
ఇదీ చదవండి:
'చైనాతో చర్చలు.. ప్రతిసారి ఫలితాలు రావు'