చైనా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. డ్రాగన్ నేలపై పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏడాదిగా అతలాకుతలం చేస్తున్న వేళ.. టీకా తయారీలో ప్రపంచ దేశాలకు ఆశాజ్యోతులుగా మారిన భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్‌లను చైనా హ్యాకర్లు లక్ష్యం చేసుకోవడం కలకలం రేపుతోంది. గోల్డ్‌మన్-శాక్స్ అనుబంధ సంస్థ.. సైఫిర్మా పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. చైనా దుశ్చర్యలకు పాల్పడటం పరిస్థితులను మరింతగా వేడెక్కిస్తున్నాయి.
ఏపీటీ10 ద్వారా..
మహమ్మారి కరోనాతో ఏడాది కాలంగా సతమతమవుతున్న భారత్ సహా.. అనేక ప్రపంచ దేశాలకు భారతీయ ఫార్మా సంస్థలు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆపద్బాంధవులుగా మారాయి. మహమ్మారిపై పోరులో టీకాస్త్రంతో సహకరిస్తున్నాయి. ఇది చైనాకు కంటగింపుగా మారగా.. ఈ రెండు సంస్థలపై దొంగదెబ్బకు పూనుకొంది ఆ దేశం. ఆ సంస్థల ఐటీ వ్యవస్థలపై ఏపీటీ10 అనే హ్యాకర్ల బృందం ద్వారా.. సైబర్ దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని ప్రముఖ నిఘా సంస్థ సైఫిర్మా వెల్లడించినట్లు రాయిటర్స్ తెలిపింది.
ఇదీ చదవండి: చైనా కుతంత్రాలకు చెక్- అమెరికా వైఖరి కీలకం
ఆ విషయాన్ని జీర్ణించుకోలేక..
కొద్ది నెలలుగా భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తగా.. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ తరుణంలో రెండు దేశాలు కరోనా అంతానికి టీకా అభివృద్ధి చేసి ఇతర దేశాలకు సాయంగా లేదా డబ్బులకు విక్రయిస్తూ వస్తున్నాయి. ఐతే చైనా తయారీ కొవిడ్ టీకాలతో పోలిస్తే.. భారత్ వ్యాక్సిన్లే ప్రపంచ వ్యాప్తంగా అధిక విశ్వాసం పొందాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన వ్యాక్సిన్లలో భారత్‌లో తయారైనవే 60శాతం వరకు ఉన్నాయి. ప్రపంచాన్ని కాపాడటంలో భారతీయ ఔషధ సంస్థలు ముందుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న చైనా.. తమ అదుపాజ్ఞల్లో పని చేసే హ్యాకర్ల బృందం ఏపీటీ10 సాయంతో.. ఆ రెండు సంస్థలపై సైబర్ దాడులకు దిగిందని సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేసే గోల్డ్‌మన్ శాక్స్ అనుబంధ సంస్థ సైఫిర్మా తెలిపింది.
వ్యాపార లబ్ధి కోసమే కుట్ర..
స్టోన్ పాండాగా పిలిచే ఈ ఏపీటీ10.. సీరమ్, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థతో పాటు సప్లై చైన్‌లో ఉండే వెసులుబాట్లను గుర్తించినట్లు సైఫిర్మా పేర్కొంది. ఈ సైబర్ దాడుల ద్వారా గ్రంథచౌర్యం సహా భారతీయ ఔషధ సంస్థల కంటే వ్యాపారపరంగా ఎక్కువ లబ్ధి పొందాలన్నదే చైనా దురాలోచన అని సైఫిర్మా ముఖ్య కార్యనిర్వహణ అధికారి కుమార్ రితేశ్ తెలిపారు. ఈయన గతంలో బ్రిటీష్ విదేశీ నిఘా సంస్థ ఎంఐ-6లో పనిచేశారు. సీరమ్‌పై ఏపీటీ10 గురి ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.
ఈ సంస్థ త్వరలోనే నొవావాక్స్ పేరిట భారీ ఎత్తున టీకా ఉత్పత్తి చేయనుంది. సీరమ్ సంస్థలోని వెబ్ సర్వర్లు.. సైబర్ దాడులకు చాలా అనుకూలమైనవని, అందుకే ఏపీటీ10 ఆ సంస్థను ప్రథమ లక్ష్యంగా ఎంచుకుందని రితేశ్ వివరించారు. హ్యాకర్లు ఈ విషయం గురించే పదేపదే చర్చికుంటున్నారని.. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పారు. చైనా విదేశీ వ్యవహరాలశాఖతోపాటు భారత్ బయోటెక్, ఎస్‌ఐఐ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించాయి. కేంద్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌తో సమాచారం పంచుకున్నామని సైఫిర్మా వెల్లడించింది.
ఇదీ చదవండి: తైవాన్ను దెబ్బతీసేందుకు చైనా 'పైనాపిల్' కుతంత్రం!
ఆ దేశాలే లక్ష్యంగా..
ఏపీటీ10 హ్యాకర్స్ గ్రూప్ అనేది చైనా రక్షణశాఖకు అనుబంధంగా పనిచేస్తుందని 2018లోనే అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. గత నవంబర్‌లో హ్యాకింగ్‌పై స్పందించిన మైక్రోసాప్ట్ సంస్థ.. రష్యా, ఉత్తరకొరియా కేంద్రంగా పనిచేసే హ్యాకింగ్ బృందాలు.. భారత్ సహా కెనడా, దక్షిణకొరియా, అమెరికాలోని టీకా తయారీ ఔషధ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు హెచ్చరించింది. ఉత్తరకొరియా హ్యాకర్లు బ్రిటిష్ ఔషధ సంస్థ అస్ట్రాజెనెకా వ్యవస్థలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేసినట్లు రాయిటర్స్ వెల్లడించింది. డెసిఫర్ అనే టూల్ సాయంతో సైఫిర్మా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 750 మంది సైబర్ నేరగాళ్లతోపాటు 2వేల వరకు హ్యాకింగ్ క్యాంపైన్స్‌పై నిఘా పెట్టి ఉంచింది. అయితే వ్యాక్సిన్‌లకు సంబంధించి.. ఏపీటీ10 ఏ విధమైన సమాచారాన్ని తస్కరించిందనే విషయం తెలియరాలేదని సైఫిర్మా పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా డోసులను బ్రెజిల్ సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ ఫైజర్, జర్మనీలోని దాని భాగస్వామ్య సంస్థ బయోఎన్‌టెక్‌కు చెందిన కీలక పత్రాలను ఐరోపా కూటమి ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గత డిసెంబర్‌లో అక్రమంగా ఎవరో చూసినట్టు ఆ సంస్థలు ఆరోపించాయి.
ఇదీ చదవండి: భారత్ 'పవర్'పై డ్రాగన్ గురి!