China Bridge At Kailash Range: 2020లో ఆగస్టులో తూర్పు లద్దాఖ్‌లోని కైలాస్ రేంజ్‌ను ఆక్రమించుకుని పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ తమపై ఆధిపత్యం సాధించడం వల్ల చైనా దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోసారి భారత్‌కు అలా దొరకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటోంది. సైనికులు, భారీ ఆయుధాలను తరలించేందుకు వీలుగా పాంగాంగ్ సరస్సు రెండు వైపులను కలుపుతూ వంతెన నిర్మాణం చేపట్టింది.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో భారత్‌తో సరిహద్దు వివాదానికి తెరతీసి భారత్‌తో తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా.. 2020 ఆగస్టులో భారత్ నుంచి ఎదురైన చేదు అనుభవంతో కొత్త ఎత్తులు వేస్తోంది. ఆ సమయంలో పాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కైలాస్ రేంజి పర్వత శిఖరాలను ఆక్రమించుకొని భారత్.. చైనా మెడలు వంచింది. కైలాశ్ రేంజిపై భారత్ ఆపరేషన్ చేపట్టాక చైనా సైన్యం సత్వరమే స్పందించి ప్రతిఘటించ లేకపోయింది. చైనా దళాలు అక్కడకు చేరుకోవడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. అప్పటి నుంచి పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ దూకుడు పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేని చైనా మరోసారి అలాంటివి జరగకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది.
సరస్సు వద్ద చైనా భూభాగం వైపు ఓ వంతెన నిర్మాణం చేపట్టింది. చైనా ఆధీనంలోని ఖురాంక్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించేలా ఈ నిర్మాణం జరుగుతోంది.అత్యంత ఇరుకుగా ఉండే ఈ ప్రాంతంలో రెడిమేడ్ నిర్మాణ సామగ్రితో చైనా పనులు కొనసాగిస్తోంది. దీని ఉపగ్రహ చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఈ వంతెన పూర్తయితే.. చైనా దళాలు 180 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది.
ఖురాంక్ నుంచి రుడాంక్‌కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి చేరుకోవచ్చు. దాదాపు 130 కిలోమీటర్లు పొడవున్న పాంగాంగ్ సరస్సులో కొంత భాగం టిబెట్‌లో ఉండగా.. మరికొంత భాగం లద్ధాఖ్‌లో ప్రాంతంలో ఉంది. ఈ వంతెన సహా కైలాస్ రేంజ్ వద్ద భారత సైనికుల ఆపరేషన్లను అడ్డుకునేందుకు వివిధ రకాల ఇతర రహదారులను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది.
భారత సరిహద్దులో చైనా జెండా
China Flag Host At Ladakh Range: అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా ఇటీవల తమ దేశ పేర్లను నిర్ణయించడంపై దేశంలో రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్ తాజా చర్యలు కలకలం రేపుతున్నాయి. 2020 జూన్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన గల్వాన్ లోయలో చైనా సైన్యం కొత్త సంవత్సరం సందర్భంగా తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది.
చైనా సైనికులు పతాకావిష్కరణ జరిపి జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోలను చైనా అధికారిక మీడియాకు చెందిన పలు వెబ్‌సైట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాయి. గల్వాన్ లోయలో భారత సరిహద్దుకు సమీపంలో పతాకావిష్కరణ జరిగినట్లు తెలిపాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన గ్లోబల్ టైమ్స్.. చైనా సైనికులు తమ దేశ ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపినట్లు వివరించింది.
ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని ఒకింత రెచ్చగొట్టేలా వ్యాఖ్య చేసింది. గల్వాన్ లోయలో చైనా పతాకం ఎగరడంపై విపక్షాలు కేంద్రంపై మాటల దాడిని మొదలుపెట్టాయి. గల్వాన్ లోయలో భారత జాతీయ పతాకం ఎగరడమే బాగుంటుందని, తమ జెండా ఎగురవేసిన చైనాకు కేంద్రం జవాబు చెప్పాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
చైనా చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని సూచించారు. అటు గల్వాన్ లోయలో చైనా పతాకావిష్కరణపై భారత సైన్యం వివరణ ఇచ్చింది. చైనా పతాకం వివాద రహిత ప్రాంతంలోనే ఎగిరిందని తెలిపారు. 2020 జూన్‌లో ఘర్షణలు జరిగిన ప్రాంతం వద్ద కాదని స్పష్టం చేసింది. గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఉన్న నిస్సైనీకరణ ప్రాంతంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది.
2020లో ఘర్షణల తర్వాత ఇరుదేశాల మధ్య పలు దఫాల చర్చల అనంతరం గల్వాన్‌లోయలో వివాదాస్పద ప్రాంతం నుంచి భారత, చైనా బలగాలు వెనక్కి తగ్గాయి.