బిహార్ ముజఫర్‌పుర్ జిల్లాలోని రామ్‌దయాళ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలి బుడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రామ్‌దయాళ్ ప్రాంతంలోని స్లమ్‌లో నివసించే ఓ కుటుంబానికి సంబంధించిన ఇంట్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవి కాస్త పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకూ వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు బాలికలు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఎస్కేఎమ్సీఎచ్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతి చెందిన చిన్నారులు నరేష్‌రామ్‌కు అనే వ్యక్తికి చెందిన నలుగురు కుమార్తెలు.. సోని(12), శివాని(8), అమృత(5), రీటా(3)గా గుర్తించారు పోలీసులు. మరోవైపు రాజేష్‌రామ్, ముఖేష్‌రామ్‌ల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడం వల్ల నిద్రిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
"నిన్న రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది."
- సతేంద్ర మిశ్రా, పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్
కారు-ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజాపుర్ గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివాహానికి వెళ్తుండగా..
న్యాయవాది అనూజ్ శ్రీవాస్తవ దహిలామౌలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. మంగళవారం ఈయన మేనకోడలి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజాపుర్ మనపట్టి సమీపంలోని లఖ్‌నవూ-వారణాసి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అటుగా వస్తున్న న్యాయవాది కుటుంబం ఉన్న ఆటోను ఢీకొట్టడం వల్ల ఆటో బోల్తా పడి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.