'అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్' అంటూ తల్లిపై ఫిర్యాదుతో పోలీస్‌స్టేషనుకు వచ్చిన 8 ఏళ్ల బాలుడిని చూసి బిహార్ పోలీసులు విస్తుపోయారు. సీతామఢీలోని చంద్రిక మార్కెట్ వీధి సిటీ పోలీసుల ముందు ఏడుస్తూ నిలుచున్న ఆ చిన్నారిని చూసి ఏమిచేయాలో కాసేపు వారికి పాలు పోలేదు. ముందుగా కడుపు నిండా అన్నం పెట్టారు.
వివరాలు ఆరా తీస్తే.. తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరోచోట ఉంటాడని బాలుడు తెలిపాడు. చెప్పిన చిరునామా ప్రకారం పోలీసులు ఆ బాలుణ్ని ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిని విచారించగా.. అలాంటిదేం లేదని, ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని ఆమె చెప్పారు. ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి తాము వెనుదిరిగినట్లు పోలీసు అధికారి రాకేశ్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారం తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ విగ్రహం.. ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై
సాధువులపై గ్రామస్థుల మూకదాడి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా అని భావించి..