Child Donate Kidney To Elders : 13 నెలల చిన్నారి రెండు కిడ్నీలను 30 ఏళ్ల వ్యక్తికి అమర్చారు బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు. ఆ ఆస్పత్రిలోని యూరో ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష హరినాథ్ నేతృత్వంలోని వైద్యుల బృందం.. రోబోటిక్ ఎన్-బ్లాక్ అనే విధానంలో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
Kidney Transplant Robotic Surgery : 'కిడ్నీఫెయిల్యూర్తో బాధపడుతున్న ఓ 30 ఏళ్ల వ్యక్తి.. హీమో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. ఓ 13 నెలల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. ఆ చిన్నారి తల్లిదండ్రుల అంగీకారంతో కిడ్నీలను దానంగా పొందాడు రోగి. అయితే, ఆ చిన్నారి బరువు 7.3 కిలోలు మాత్రమే. 30 ఏళ్ల వ్యక్తి 50 కిలోల బరువు ఉన్నాడు. కాబట్టి అతడికి ఆ చిన్నారి కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడం సవాలుతో కూడుకున్న పని. ఈ ఆపరేషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని.. రోబోటిక్ ఎన్-బ్లాక్ విధానం ద్వారా కిడ్నీలు మార్పిడి చేశాం. ఈ వినూత్న విధానం ద్వారా మార్పిడి చేసిన మూత్రపిండాలు.. గ్రహీత శరీర బరువుకు తగిన పరిమాణంలో పెరుగుతాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ సంక్లిష్ట సర్జరీ తర్వాత, రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచాం. 12 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి అతడు డిశ్చార్జ్ అయ్యాడు' అని డాక్టర్ కేశవమూర్తి తెలిపారు.
"కిడ్నీ మార్పిడిలో ఎలాంటి కష్టమైన శస్త్రచికిత్స అయినా రోబోటిక్స్‌తో సులభంగా నిర్వహించవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల కిడ్నీని పెద్దవారికి అమర్చడం సవాలే. మా వైద్యుల బృందం సరికొత్త సాంకేతికతను ఉపయోగించి ఈ వినూత్న ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇలాంటి సర్జరీ ప్రపంచంలోనే ఇదే మొదటిది."
--అక్షయ్ ఓలేటి, ఫోర్టిస్ ఆస్పత్రి బిజినెస్ హెడ్
తల్లి గర్భంలోనే.. పిండానికి ఆపరేషన్!
ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఇంకా గర్భంలోనే ఉన్న ఓ పిండానికి బ్రెయిన్ సర్జరీ చేశారు వైద్యులు. తల్లి కడుపులోనే మెదడు నుంచి రక్తస్త్రావం జరుగుతున్న ఆ చిన్నారికి.. విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తల్లి గర్భంలో 34 వారాల వయస్సున్న చిన్నారికి సర్జరీ చేసి రికార్డు సృష్టించారు. అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్ వైద్యులు ఈ ఘనత సాధించారు. పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.