72వ గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు దిల్లీలో సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత జరిగే రెండో గణతంత్ర వేడుకల్లో ఈసారి అతిథులు ఎవరూ హాజరుకావడం లేదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను తొలుత ఆహ్వానించినప్పటికీ.. యూకేలో కరోనా కొత్త వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఆయన ప్రయాణం రద్దయింది.
గతంలో ఘనంగా..
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత గణతంత్ర వేడుకలకు వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. భారత గణతంత్ర వేడుకల నిర్వహణపై వారు ప్రశంసలూ కురిపించారు.
గత ఆరేళ్లలో గణతంత్ర వేడుకలకు వచ్చిన అతిథులను మరోసారి గుర్తుచేసుకుందాం.
2015:
మోదీ ప్రధానైన తర్వాత 2015లో జరిగిన మొదటి గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఒబామాకు ఘన స్వాగతం పలికారు. 66వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒబామా పర్యటన సందర్భంగా వాతావరణ మార్పులు, వాణిజ్య రంగంలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.
2016:
67వ గణతంత్ర వేడుకలకు అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ముఖ్య అతిథి. భారత సైనిక విన్యాసాలు, కవాతుకు ముగ్ధులయ్యారాయన. హోలాండే పర్యటన సందర్భంగా అణు, అంతరిక్ష సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకొన్నాయి.
2017:
2017లో జరిగిన 68వ గణతంత్ర వేడుకలకు అబుదాబి రాకుమారుడు మహమ్మద్ బిన్ జాయేద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
2018:
69వ గణతంత్ర వేడుకలకు ఆసియా ఖండంలోని బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం మొత్తం పది దేశాల నుంచి దేశాధినేతలు హాజరయ్యారు. భారత గణతంత్ర వేడుకులు అమోఘమని ప్రశంసించారు.
2019:
గతేడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా 5వ అధ్యక్షుడిగా ఎన్నికైన సిరిల్ రమాఫొసా హాజరయ్యారు.
2020:
71వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారో హాజరయ్యారు.