చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పించింది ఛత్తీస్‌గఢ్ సర్కారు. పది, పన్నెండో తరగతులలో టాపర్లుగా నిలిచిన వారితో హెలికాప్టర్‌లో గగన విహారం చేయించింది. దీంతో విద్యార్థినులు ఆనందంతో పొంగిపోయారు. తొలిసారి హెలికాప్టర్‌లో ప్రయాణించామని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించేందుకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 'పిల్లలను మరింతలా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ హెలికాప్టర్ రైడ్.. పిల్లలు తమ జీవిత గగనతలంలో ఎగరాలనే కోరికను పెంపొందిస్తోంది. తద్వారా తమ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలకు మరింత పదును పెట్టేందుకు దోహదం చేస్తుంది' అని బఘేల్ గతంలో పేర్కొన్నారు.
ఈ హామీని నెరవేర్చినట్లు తాజాగా రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెక్కం తెలిపారు. విద్యార్థులను రాయ్‌పుర్‌కు ఆహ్వానించినట్లు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.