Chhattisgarh Elections Results 2023 in Telugu : ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆధిక్యంలో దూసుకుపోతోంది బీజేపీ. అధికార కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు ప్రకటించగా.. వాటన్నింటినీ తారుమారు చేస్తూ బీజేపీ తన జోరును కొనసాగిస్తోంది. 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. అధికార కాంగ్రెస్ 30+ సీట్లకే పరిమితమైంది.
ముఖ్యమంత్రి బఘేల్ వెనుకంజ
మరోవైపు పటాన్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ విజయ్ వర్గీయ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్ సైతం వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి తనయుడు, జేసీసీజే పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి, ఆయన తల్లి రేణు జోగి సైతం వెనుకంజలో ఉన్నారు. అయితే, రాజ్‌నంద్‌గావ్ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ముందజలో ఉన్నారు. రాయ్‌పుర్ సిటీ సౌత్ నుంచి బీజేపీ సీనియర్ నేత బ్రిజ్మోహన్ అగర్వాల్ ముందజలో ఉన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : రమణ్ సింగ్
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. 42-55 సీట్ల మధ్య గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టమైన మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఛత్తీస్‌గఢ్ బీజేపీ కో ఇంఛార్జ్ నితిన్. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైందని ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు.
"గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌ను నాశనం చేసింది. బీజేపీ మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతుందని ప్రజలు నమ్మారు. అందుకే మాపై నమ్మకం ఉంచి ఆధిక్యాన్ని కట్టబెట్టారు"
--అరుణ్ సావో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ హస్తం పార్టీదే విజయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 90స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవచ్చని వెల్లడించాయి. కాంగ్రెస్ 49 నుంచి 65 చోట్ల గెలిచి ఛత్తీస్‌గడ్‌లో తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. బీజేపీకి 25 నుంచి 41 స్థానాలు, ఇతరులు 3 చోట్ల విజయం సాధించవచ్చని పేర్కొంది. వీటన్నింటికి పూర్తి భిన్నంగా ఫలితాలు వెల్లడయ్యాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">