ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం 5 గంటల వరకు 70.59 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలీసులు, పారామిలిటరీ దళాల పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్ సాగింది. నక్సల్ ప్రభావిత గరియాబంద్ జిల్లా బింద్రనవాగఢ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతంలో పోలింగ్ మధ్యాహ్నం 3 వరకే కొనసాగింది. కమర్భౌడి, అమమోరా, ఓధ్, బడే గోబ్రా, గన్వార్గావ్, గరిబా, నాగేశ్, సాబిన్కచార్, కోడోమలి పోలింగ్ బూత్‌లలో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. తొలి విడతలో 20 సీట్లకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. తన సొంత నియోజకవర్గమైన పాటన్‌లోని కురుద్దీ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాటన్‌లో పోటీ ఏకపక్షమేనని బఘేల్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 75కు పైగా సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సివిల్ లైన్స్ రాయ్‌పుర్‌లో ఓటు వేశారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న.. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ (అంబికాపుర్), రాష్ట్ర మంత్రులు రవీంద్ర చౌబే(సజా), అనిలా భేడియా (దోండిలోహరా), అమర్జీత్ భగత్ (సీతాపుర్), జైసింగ్ అగర్వాల్, అసెంబ్లీ స్పీకర్ చరణ్‌దాస్ మహంత్ (సక్తీ) తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న బీజేపీ చీఫ్, ఎంపీ అరుణ్ సావ్.. బిలాస్‌పుర్‌లో, కేంద్ర మంత్రి రేణుకా సింగ్.. ప్రేమ్‌నగర్‌లో ఓటేశారు.
గుండెపోటుతో మృతి
బలౌదాబాజార్ జిల్లా కస్డోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. అనంతరం.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ బయట ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు, కోరియా జిల్లాలో ఓటేసేందుకు వస్తున్న ఓ వ్యక్తి... ఏనుగు దాడిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
పలు ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని ఆరోపిస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రామంలో రోడ్లు నిర్మించలేదని రాయ్‌గఢ్ జిల్లాలోని తెంతగుడ్డి గ్రామ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఓటింగ్‌కు రాబోమని స్పష్టం చేశారు. బిలాస్‌పుర్ జిల్లా, మస్తూరీ సెగ్మెంట్లోని మాణిక్‌పుర్ ధేన్కా గ్రామ ప్రజలు సైతం ఓటు వేయడానికి నిరాకరించారు. తమ గ్రామంలో రోడ్ల నిర్మాణం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులతో మాట్లాడి ఓటింగ్‌కు ఒప్పించేందుకు అధికారులను పంపించినట్లు బిలాస్‌పుర్ కలెక్టర్ అవనీశ్ శరణ్ తెలిపారు.
రెచ్చిపోయిన నక్సల్స్- ఒకరు మృతి!
పోలింగ్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు నక్సలైట్లు. ఇందుకోసం ఐఈడీ పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన బడే గోబ్రా పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. విధుల నుంచి తిరిగి వస్తున్న భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ పేలుడు ధాటికి అటుగా వెళ్తున్న ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ జోగిందర్ సింగ్ మరణించారని రాయ్‌పుర్ ఐజీ రేంజ్ ఆరిఫ్ షేక్ తెలిపారు. విధుల్లో పాల్గొన్న మిగతా సిబ్బంది సహా పోలింగ్ సామగ్రిని సురక్షితంగా గరియాబంద్‌కు చేర్చినట్లుగా ఆయన చెప్పారు.