Collector's daughter in govt school: ప్రభుత్వ పాఠశాల పేరు వినగానే ఇప్పట్లో చాలామందికి శిథిలావస్థలో ఉన్న భవనం, పాతకాలం కుర్చీలో కూర్చొని కాలక్షేపం చేస్తున్న ఉపాధ్యాయుడి చిత్రాలు గుర్తుకువస్తాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా ప్రభుత్వ పాఠశాల చూస్తే కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నాయని అనకుండా ఉండలేము. ఆ జిల్లా కలెక్టర్ కూడా తన కుమార్తెను ఈ పాఠశాలలోనే చేర్పించడం విశేషం.
జిల్లాలోని స్వామి ఆత్మానంద్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాల.. ప్రైవేటుకు దీటుగా అధునాతన సదుపాయాలను కలిగి ఉంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, బోర్డులు, మంచి టీచర్లకు తోడు ఆకర్షణీయమైన పాఠశాల వాతావరణం చదువుకోవడానికి అనుకూలంగా ఉంది.
"ఈ పాఠశాలలో బోధన బాగుంటుంది. జిల్లాలో ఆంగ్ల మాధ్యమంలో ఈ పాఠశాల ఉత్తమమైనది. అందుకే నా బిడ్డను ఈ స్కూల్లో చేర్పించాను."
- సంజీవ్ కుమార్ ఝా, కలెక్టర్
మంచి నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా ఇక్కడి విద్యార్థులు గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలు కనబరుస్తున్నారు.
"నా పేరు సృష్టి సోనీ. స్వామి ఆత్మానంద్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. ప్రైవేట్ పాఠశాల కంటే ఇక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రెవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులతో సమానంగా ఈ పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు.''
-సృష్టి సోనీ, పదవ తరగతి విద్యార్థిని
తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అడ్మిషన్ కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే కలెక్టర్ సంజీవ్ ఝా.. తన కుమార్తెను ఈ స్కూల్లో చేర్పించారు. కలెక్టర్ కూతురు ఇశానీ ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది.
కలెక్టర్ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ స్వయంగా పాఠశాల స్థితిగతులను చూస్తుంటారు కాబట్టి మెరుగైన ఫలితాలు రాబట్టడానికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి:Universal Health Coverage Day: లోటుపాట్లు దిద్దుకొంటేనే ప్రజారోగ్యం
'నేనూ నాన్నలాగే పైలట్ అవుతా'.. వింగ్ కమాండర్ కూతురు భావోద్వేగం!