NTR Centenary Celebrations In Hyderabad : ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ - మూసాపేట ప్రాంతాల మధ్య ఉన్న కైత్లాపూర్ మైదానంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్‌కు దేశ, విదేశాల్లో ఘన నివాళులు అర్పిస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి.. ఎన్టీఆర్ అని తెలియజేప్పారు. లంచాలు నచ్చక ఉద్యోగానికే రాజీనామా చేసిన వ్యక్తి ఆయన అని చెప్పారు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి.. రాయలసీమలో కరవు సంభవిస్తే ఇంటింటికీ తిరిగి చందాలు అడిగిన ఆ ప్రాంతాన్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని స్మరించుకున్నారు. అలాగే ఆ మహానటుడే దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకున్నారని తెలిపారు. ఇప్పుడు అమలయ్యే అనేక కార్యక్రమాలకు ఎన్టీఆరే నాంది పలికారని టీడీపీ అధినేత వివరించారు. తెలుగు వారి ఆస్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల్లోనే మహాశక్తి దాక్కుని ఉందని ఈ సందర్భంగా వర్ణించారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతామన్నారు. ఆయనకు ఆ అవార్డును ఇస్తే దేశానికే గౌరవం వస్తోందని తెలిపారు. ఈ నెల 28న ప్రతి ఇంట్లో ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు.
తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత.. ఎన్టీఆర్ : నటసార్వభౌమ, నట రత్న ఎన్టీఆర్ కారణజన్ముడు, మహానుభావుడు అని అతని కుమారుడు, నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్నో సాహసోపేతమైన పాత్రలను అద్భుతంగా పోషించారన్నారు. ఎన్టీఆర్ మహోన్నత నటన విశ్వవ్యాప్తమైందన్నారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత.. ఎన్టీఆర్‌కే చెందుతుందని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నూతన శకానికి ఆరంభం అని తెలిజేశారు.
"ప్రజల మనసుల్లో శాశ్వతస్థానం పొందిన వ్యక్తి.. ఎన్టీఆర్. నటనలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత.. ఎన్టీఆర్‌దే. తెలుగువారికి రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి.. ఎన్టీఆర్. ఎన్టీఆర్.. రాష్ట్రంలో ఎన్నో సామాజిక సంస్కరణలు తెచ్చారు. పేద పిల్లలకు విద్యను అందిచిన ఘనత.. ఎన్టీఆర్‌దే. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చిన ఘనత.. ఎన్టీఆర్‌దే. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని నాయకులంతా నడవాలని" బాలకృష్ణ సూచించారు.
ఇవీ చదవండి :