Chandrababu Naidu granted regular bail in skill case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఉపశమనం లభించింది. ఈ కేసులో హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ షరతులు... ఈ నెల 28 వరకే వర్తిస్తాయని.. 29 నుంచి రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొనవచ్చని కోర్టు చెప్పింది.
రెగ్యులర్ బెయిల్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు.. హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై గత వారం ఇరుపక్షాల వాదనలు విని తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు తాజాగా తీర్పు వెలువరించారు. అక్టోబర్ 31న తాత్కాలిక బెయిల్ మంజూరు సమయంలో ఇచ్చిన షరతులపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని... మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల28 వరకే వర్తిస్తాయని పేర్కొంది. 29 నుంచి చంద్రబాబు యథావిధిగా... స్వేచ్ఛగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు చికిత్సకు సంబంధించిన నివేదికను ఈ నెల 30న ఏసీబీ కోర్టులో అందించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.
సీఐడీ విఫలమైంది: నేరంపై అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయాలని... చంద్రబాబు అరెస్టులో అలాంటివేవీ పాటించలేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన 30 రోజుల తర్వాత కూడా... ఆధారాలు సమర్పించడంలో సీఐడీ విఫలమైందని... కోర్టు ఆక్షేపించింది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో ముఖ్యమంత్రి పాత్ర ఉందని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది. తెలుగుదేశం పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఆధారాలు లేవన్న చంద్రబాబు న్యాయవాదుల వాదనలతో ఏకభవిస్తున్నామని... న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రతి గుత్తేదారు, ఉపగుత్తేదారు చేసే తప్పులకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయలేరని హైకోర్టు స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని కూడా కోర్టు తేల్చి చెప్పింది.
సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది: ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలల పాటు చంద్రబాబు బయటే ఉన్నారని.. అరెస్ట్ చేసే ముందే కేసు నమోదు చేశారని హైకోర్టు పేర్కొంది. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం కూడా సీఐడీ చూపలేకపోయిందని.... హైకోర్టు వ్యాఖ్యానించింది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని... కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశం లేదని హైకోర్టు తీర్పులో వివరించింది. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదని కూడా తెలిపింది.
ఆ బాధ్యత సీఎంది కాదు: సీమెన్స్ డైరెక్టర్, డిజైన్‌టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు.., చంద్రబాబుకు సంబంధం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సీమెన్స్‌తో ఒప్పందం సోమ్యాద్రి శేఖర్ బోస్ పేరుతో ఉందని... సుమన్‌బోస్ పేరుతో సంతకం ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనలపై స్పందించిన హైకోర్టు... సంతకాలు పరిశీలించే బాధ్యత సీఎంది కాదని చెప్పింది. సంతకంపై అభ్యంతరాలుంటే ఫోరెన్సిక్ సహాయంతో విచారణలో తేల్చాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.
కనీస ఆధారాలు ఉండాలి కదా?: గత ప్రభుత్వ హయాంలోనే అక్రమ లావాదేవీలు జరిగాయనేందుకు ఆధారాలు లేవన్న హైకోర్టు... ఐటీశాఖ విచారణలో చంద్రబాబు పాత్ర ఉందన్న వాదనలకు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొంది. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలకు సంబంధించి.. సీఐడీ ఇచ్చిన నోటీసుకు పార్టీ సమాధానం చెప్పనందున... బెయిల్ నిరాకరించాలన్న ప్రాసిక్యూషన్ వాదననూ కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో కనీస ఆధారాలు కూడా ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచనందున... దీన్ని ఎలా పరిగణనలోకి తీసుకోగలమని... కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేసేటప్పుడు కనీస ఆధారాలు ఉండాలి కదా అని జస్టిస్ మల్లికార్జునరావు తీర్పులో పేర్కొన్నారు.
చంద్రబాబు బాధ్యత ఏమిటో?: స్కిల్ కేసులో ఏపీ సీఐడీ... శరత్ అండ్ అసోసియేట్స్ నివేదికపై ప్రధానంగా ఆధారపడినట్లు కనిపిస్తోందని హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఆ నివేదికలో ఎంఓయూ జరిగిన ప్రదేశంపై డిజైన్‌టెక్-సీమెన్స్ ప్రకటనల మధ్య తేడా ఉన్నట్లు పేర్కొన్నారని కోర్టు గుర్తుచేసింది. అయితే ఎంవోయూ అమలు జరిగిందన్న అంశంపై ఎలాంటి వివాదం లేనప్పుడు... ఎంవోయూ జరిగిన ప్రదేశం, తేదీపై విరుద్ధమైన ప్రకటనల్లో చంద్రబాబు బాధ్యత ఏమిటో ప్రాసిక్యూషన్ చెప్పాలని హైకోర్టు చెప్పింది.