Chandrababu Filed Petition in Supreme Court : క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా తనకి వ్యతిరేకంగా కేసు నమోదు చేశారని తెలిపారు.
Chandrababu Quash Petition in High Court : 20 నెలల క్రితం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా అకస్మాత్తుగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోయినా రాజకీయ కారణాలతో అదుపులోకి తీసుకున్నారని పిటిషన్‌లో తెలిపారు. చట్టవిరుద్ధంగా, దురుద్దేశపూర్వకంగా జరుగుతున్న దర్యాప్తుతో తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇప్పటి వరకూ అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17ఎ కింద చట్టబద్ధమైన అనుమతి తీసుకోనందున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టడం చెల్లుబాటు కావని పేర్కొన్నారు.
సెక్షన్ 17ఎ కింద ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్టేట్ ఆఫ్ హరియాణా వర్సెస్ భజన్‌లాల్, యశ్వంత్‌సిన్హా వర్సెస్ సీబీఐ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‌మల్ చౌధరి కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఆ అనుమతి లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, అరెస్టు, రిమాండు, ఇతరత్రా చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెక్షన్ 17ఎ కింద తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులను తప్పుగా అర్థం చేసుకొని దాని ప్రభావాన్ని నీరుగార్చిందని పేర్కొన్నారు.
Chandrababu Expressed his Anguish Before Judge: "ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేశారు.. జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు"
Chandrababu Petition in Supreme Court : ఈ కేసును ప్రధానంగా 17-ఎ కింద సవాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని చుట్టూ రకరకాల వాదనలను నమోదుచేసిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆ సెక్షన్ వర్తింపునకు మినహాయింపులు సృష్టించిందని వాస్తవానికి అలాంటివేమీ చట్టంలో లేవని తెలిపారు. సెక్షన్ 482 సీఆర్‌పీసీ జ్యూరిస్‌డిక్షన్‌ను అనుసరించి ఇక్కడ మినీ ట్రయల్ అవసరం లేదని.. ఒకచోట చెప్పిన హైకోర్టు, మరోవైపు కేసు వివరాలను నమోదు చేసిందని తెలిపారు.
తద్వారా మినీట్రయల్ నిర్వహించడంతో పాటు ఆధారాలేవీ లేకుండానే పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనం పొందినట్టు ఏకపక్షంగా వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు, తదనంతరం సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, పిటిషనర్‌ను రిమాండుకు ఇవ్వడంలో ఉన్న అవకతవకల గురించి హైకోర్టు చూడలేదని, అందువల్ల తీర్పు చెల్లదని పిటషన్‌లో తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19కి సంబంధించి పిల్లి సాంబశివరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో వచ్చిన తీర్పుపై హైకోర్టు ఆధారపడిందని ఆ కేసుకు, ఈ కేసుకు సంబంధం లేదని పేర్కొన్నారు.
2018 జూన్ 5న రెగ్యులర్ ఎంక్వయిరీకి ఆర్డర్ చేసినట్లు హైకోర్టు తన తీర్పులోని పేరా 16లో పేర్కొనడం అసంబద్ధమని, వాస్తవానికి అది నిజం కూడా కాదని తెలిపారు. రికార్డుల్లోని అంశాలకు విరుద్ధమని సెక్షన్ 17ఎ నిబంధనను తప్పించుకోవడానికి కొత్తగా చేసిన ఆలోచన అని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ 2021 సెప్టెంబరు 7న మొదలైనట్లు ఎఫ్‌ఐఆర్ స్పష్టంగా చెబుతోందన్నారు. 2021 డిసెంబరు 7న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైందని అందులో ఎక్కడా 2018కి సంబంధించి విచారణ, ఫిర్యాదుల గురించి ప్రస్తావించలేదని పిటిషన్‌లో తెలిపారు.
2018 జులై 26కు ముందు జరిగిన కేసులకు సెక్షన్ 17-ఎ వర్తించదని హైకోర్టు తన తీర్పులో పేర్కొనడం పూర్తిగా తప్పుని పిటిషన్‌లో ప్రస్తావించారు. విధాన ప్రక్రియకు సంబంధించిన సవరణలు నేరం ఎప్పుడు జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా 2018 జులై 26కి ముందు, తర్వాత తీసుకున్న అన్ని చర్యలూ, అన్ని ఎఫ్‌ఐఆర్‌లు, విచారణలకూ వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయం ఇప్పటికే చట్టపరంగా నిర్ధారణ అయిందని ఈ విషయాన్ని హైకోర్టు విస్మరించిందని పేర్కొన్నారు.
AP High Court Dismissed Chandrababu Quash Petition: దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరం లేదు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత
పబ్లిక్ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాలపై విచారణకు సెక్షన్ 17ఎ కింద పరిమితులు ఉన్న విషయాన్ని ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, రిమాండు రిపోర్టులు స్పష్టంగా చెబుతున్నాయని పైన పేర్కొన్న సూత్రాన్ని పరీక్షించి చూశాం. అయితే డాక్యుమెంట్ల ఆధారంగా డబ్బు చెల్లించాలని పిటిషనర్ ఆదేశించడం దాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆయన అధికారిక విధుల నిర్వహణ కింద పరిగణించలేమని, అందువల్ల ఈ ఆరోపిత నేరం గురించి దర్యాప్తు జరపడానికి అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తన తీర్పులోని పేరా 23లో చెప్పడం పూర్తిగా తప్పని తెలిపారు.
ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని ఇలాంటి భాష్యాల వల్ల సెక్షన్ 17ఎ కింద పబ్లిక్ సర్వెంట్లకు ఇచ్చిన రక్షణలు ఎందుకూ పనికి రాకుండా పోతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లు హైకోర్టు పేర్కొందని ఇది తనని జ్యుడిషియల్ కస్టడీ, పోలీసు కస్టడీకి కోరుతూ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన దరఖాస్తుల్లోని అంశాలకు పూర్తి భిన్నమని తెలిపారు. ఇంకా దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నట్లు ప్రతివాదులు చెప్పిన విషయాన్ని హైకోర్టు తీర్పులోని 7వ పేరాలో పేర్కొందని అందువల్ల ఈ కేసు దర్యాప్తు తుది దశకు వచ్చిందని చెప్పడం ఇందుకు విరుద్ధమని పిటిషన్‌లో ప్రస్తావించారు.
Chandrababu was Arrested by CID : ఎఫ్‌ఐఆర్ నమోదైన 20 నెలల తర్వాత, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ కారణాలతో అరెస్టు చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వం చేస్తున్న నకిలీ ఓట్ల చేరిక, పెద్దఎత్తున ఓట్లను తొలగించడం గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు, భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుండటంతో అడ్డుకోవడానికే అరెస్టు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో ఉండగా ఈ నెల 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నంద్యాలలో పోలీసులు తనని చుట్టుముట్టారని, సీఆర్‌పీసీ కింద ఉన్న నిబంధనలను అనుసరించకుండా, అరెస్టుకు కారణాలు చూపకుండా అదుపులోకి తీసుకున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఎన్‌ఎస్‌జీ జడ్+ సెక్యూరిటీలో ఉన్న తనని.... ఆర్టికల్ 222, సీఆర్‌పీసీ సెక్షన్ 167 ప్రకారం సమీపంలోని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండా. రోడ్డుమార్గంలో 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్లారని తెలిపారు. టీడీపీ రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్న తరుణంలో ఏపీ సీఐడీ పోలీసులు అక్కడి అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకొని అరెస్టు చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కిందికి వస్తుందని పేర్కొన్నారు.
పిటిషనర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలోని ఇతర వ్యక్తులను ఇందులో ఇరికించడానికి సీఐడీ పోలీసులు అధికారులను బెదిరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఆ ధర్మాసనం ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా తదుపరి విచారణ ప్రక్రియ సాగుతుంది.