Chandrababu Family Members at Rajamahendravaram Central Jail: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుకు కుటుంబ సభ్యులు అండగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ములాఖత్‌లో ఆయన్ను కలిసి ధైర్యం చెప్పారు. ముఖ్యంగా లోకేశ్ రాజమహేంద్రవరంలోనే బస ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు చంద్రబాబు బాగోగులు చూసుకోవడమే కాకుండా.. ఈ అక్రమ కేసు నుంచి ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు నిరంతరం న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. ఊహించని ఈ పరిణామం నుంచి తేరుకుని చంద్రబాబు కుటుంబం మొత్తం ఆయనకు సమీపంలోనే బస ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.
TDP Protests Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. 'బాబుతో నేను అంటూ' నిరసనలు
కారాగారానికి సమీపంలోనే కుటుంబసభ్యులు: రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి సమీపంలోని విద్యానగర్‌లోనే ఓ నివాస ప్రాంగణంలో లోకేశ్ బస చేస్తున్నారు. అక్కడే నిలిపి ఉంచిన యువగళం బస్సులోనే లోకేశ్ ఉంటున్నారు. చంద్రబాబును కలిసేందుకు వచ్చిన భువనేశ్వరి, బ్రహ్మణీ సైతం బస్సులో ఉంటున్నారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుల నుంచి ఆయన్ను గట్టెక్కించేలా కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
న్యాయవాది సిద్ధార్థ లూథ్రాతో చర్చలు : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుంచి చంద్రబాబుకు విముక్తి కలిగించేందుకు న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాతోనూ కుటుంబ సభ్యులు చర్చించారు. ఆయనతోపాటు రాష్ట్రంలోని సీనియర్ న్యాయవాదులతోనూ లోకేశ్ న్యాయపరమైన అంశాలపై లోతుగా చర్చలు జరుపుతున్నారు.
పెద్ద సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు: చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు పెద్దసంఖ్యలో ప్రముఖులు, అభిమానులు రాజమహేంద్రవరం వస్తున్నారు. లోకేశ్‌ను కలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలతోపాటు జనసేన, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున రావడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వస్తున్న ముఖ్య నాయకులను కలిసి భవిష్యత్ కార్యాచరణపై లోకేశ్ వారితో చర్చిస్తున్నారు.
టీడీపీ నేతలపైనా కేసులపై స్పందించిన లోకేశ్: నిరసన తెలుపుతున్న పార్టీ నేతలపైనా అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ తాత్కాలిక ఆనందం పడొచ్చుగానీ.. దీన్నిబట్టే ప్రభుత్వ బలహీనత, జగన్ భయం తేటతెల్లమవుతోందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని లోకేశ్ తెలిపారు.