కరోనా వైరస్ కేసుల పెరుగుదల విషయమై పలు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, బంగాల్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని.. కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 59శాతం ఈ 4 రాష్ట్రాల్లో నమోదైనవేనని తెలిపారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవారాలని ఆయన రాష్ట్రాల అధికారులకు గుర్తుచేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.29లక్షల కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలో52వేలు, కేరళలో 65వేలు, బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల్లో చెరో 9వేలు ఉన్నాయి. కరోనా సంబంధిత మరణాల సంఖ్య మహారాష్ట్రలో 50వేలు, బెంగాల్‌లో 10వేలు, ఛత్తీస్‌గఢ్‌లో 3.5వేలుగా నమోదైంది. కేరళలో గత వారం రోజుకు సగటున 5వేల కొత్త కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 3.5వేల కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కేరళలో సోమవారం తొలి స్ట్రెయిన్ కేసు కూడా నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 70కిపైగా స్ట్రెయిన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: 'దేశాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చిన ఘనత మీదే'