ప్రధాని నరేంద్రమోదీపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. ఇటలీలో జరిగే ప్రపంచశాంతి సదస్సుకు తనకు ఆహ్వానం వచ్చినా కేంద్రం వెళ్లనివ్వడం లేదన్నారు. ప్రధాని మోదీ తనను చూసి అసూయపడుతున్నారని మమత విమర్శించారు. సీఎం ఆ సదస్సుకు వెళ్లడం సరికాదంటూ కేంద్రం తన ఇటలీ పర్యటనను అడ్డుకుంటోందని ఆరోపించారు. తనపై అసూయతోనే మోదీ ఇదంతా చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.
హిందువుల గురించే ఎక్కువగామాట్లాడే ప్రధాని.. ఒక హిందూ మహిళనైన తనను ఇటలీ వెళ్లేందుకు ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు పన్నినా తనను ఇటవీ వెళ్లకుండా ఆపలేరని అన్నారు. పర్యటనల పేరుతో విదేశాలకు వెళ్లాలన్న మోజు తనకు లేదన్న మమత... ఇటలీ ఆహ్వానం దేశ గౌరవానికి సంబంధించిన విషయమని తెలిపారు.
"రోమ్‌లో జరగబోయే ప్రపంచ శాంతి సమావేశానికి హాజరాకావాల్సిందిగా నాకు ఆహ్వానం అందింది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పోప్ ఫ్రాన్సిస్‌లు హాజరయ్యే ఈ సమావేశానికి కావాల్సి ఉంది. ఇటలీ నుంచి ప్రత్యేక అనుమతి సైతం వచ్చింది. అయితే కేంద్రం మాత్రం నా పర్యటనను నిరాకరించింది. ఓ ముఖ్యమంత్రిని ఇలా అడ్డుకోవడం సరికాదు."
-మమతా బెనర్జీ
ఇక దేశవ్యాప్తంగా భాజపా పతనం భవానీపూర్ ఉపఎన్నిక నుంచే ప్రారంభమవనున్నట్లు మమత జోస్యం చెప్పారు. భాజపాను తాలిబన్లతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"మన స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి. భారత్‌ను 'తాలిబన్' భాజపా నడిపించలేదు. ఆ పార్టీని ఓడించేందుకు టీఎంసీ ఒక్కటి చాలు. భవానీపూర్ నుంచే ఆట(ఖేలా) ప్రారంభమవుతుంది. ఈ గెలుపు పరంపర దేశం మొత్తం టీఎంసీ గెలిచిన తర్వాతే ముగుస్తుంది."
-కోల్‌కతా సభలో మమతా బెనర్జీ
మరోవైపు.. కేంద్రం తీరుపై టీఎంసీ అధికార ప్రతినిధి దేబాంగ్షు భట్టాచార్య మండిపట్టారు. గతంలోనూ మమత చైనా పర్యటనను కేంద్రం రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన అంతర్జాతీయ సంబంధాలు, భారత దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానికి తాము అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పుడు మమత ఇటలీ పర్యటనను రద్దు చేయడానికి గల కారణాలేంటో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: