Droupadi Murmu Z+ Security: రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున ఝార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముర్ముకు కేంద్రం.. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి బుధవారం నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.
Droupadi Murmu Temple: ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం.. ఒడిశాలోని రాయ్‌రంగ్‌పుర్‌లో ఉన్న శివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆలయ ప్రాంగణాన్ని చీపురు పట్టి శుభ్రం చేశారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకున్నారు. జహీరా అనే గిరిజన ప్రార్థన స్థలాన్ని కూడా ఆమె సందర్శించారు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు పొందుపరచి ఉన్నాయో.. వాటి ప్రకారమే పనిచేస్తానని ఆమె చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జూలై 18న జరగనుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ముర్ము గెలిస్తే... ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతితో పాటు దేశానికి రెండో మహిళా రాష్ట్రపతి అవుతారు.
ఎవరీ ద్రౌపది ముర్ము?
Droupadi Murmu: ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైదపోసిలో సంతాల్ గిరిజన తెగలో 1958 జూన్ 20న ద్రౌపది ముర్ము జన్మించారు. 2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఆమె పనిచేశారు. ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ఆమె నియమితులయ్యారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం. ఒడిశాలోని రాయరంగాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భాజపా, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా శాఖ, మత్స్యసంపద, పశుసంవర్ధక శాఖ మంత్రిగా సేవలందించారు. ముర్ము రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా కూడా కొంతకాలం పనిచేశారు.
ఇవీ చదవండి: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
బిహార్ టు కశ్మీర్.. మోదీ వచ్చాకే కూలుతున్న ప్రభుత్వాలు.. ఇలా ఎన్నో!