కరోనా పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత టీకా విధానం అమలులోకి వచ్చింది. వయోజనులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటనకు అనుగుణంగా సోమవారం కార్యాచరణ ప్రారంభించారు. ఈ ఒక్క రోజే 50 లక్షల మందికి టీకా వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త విధానం- కీలకాంశాలు
- టీకాలకు అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుంది.
- 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు.
- రాష్ట్రాలకు టీకాను కొని ఉచితంగా ఇవ్వనున్న కేంద్రం.
- ప్రైవేటు ఆస్పత్రుల్లో సొంత ఖర్చుతో టీకా వేసుకునే అవకాశం- గరిష్ఠంగా రూ.150 సర్వీస్ ఛార్జి వసూలు.
- టీకాల ఉత్పత్తిలో 75 శాతం కేంద్రమే సేకరిస్తుంది.
- ఉత్పత్తిలో 25 శాతం టీకాలు ప్రైవేటు రంగానికే కేటాయింపు.
- నవంబరు నాటికి 80 శాతం మందికి టీకాలు వేయడమే లక్ష్యంగా అడుగులు.
కరోనాపై పోరు తుది దశకు..
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కొత్త దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్‌లోని ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్నిపరిశీలించారు. జులై-ఆగస్టులో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటుందని చెప్పారు అమిత్ షా.
ఇదీ చూడండి: 'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'