Amit Shah Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ప్రధాని పదవి కోసమే నీతీశ్.. ఆర్జేడీ అధినేత లాలూతో జట్టు కట్టారని ఆరోపించారు. బిహార్‌లో భాజపా అధికారం కోల్పోయాక.. ఆ రాష్ట్రంలో తొలిసారి పర్యటించారు అమిత్ షా. పూర్ణియాలో ఏర్పాటు చేసిన భాజపా 'జన భావన మహాసభ'లో పాల్గొన్న ఆయన.. నీతీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.
"కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు వెన్నుపోటు పొడిచి నీతీశ్.. విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ప్రధాని అయ్యేందుకే లాలూ, కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. అధికార కాంక్షతో రాజకీయ కూటములు మార్చుతూ నీతీశ్ ప్రధాని కాగలరా? అసలు ఈ ప్రభుత్వం బిహార్‌ను పాలించగలదా?.. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన చాలా మందిని వెన్నుపోటు పొడిచారు. లాలూ జీ.. మీరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నీతీశ్ రేపు మిమ్మల్ని వెనక్కినెట్టే అవకాశమూ ఉంది."
-- అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి
'విభేదాలు సృష్టించడానికి మీరు ఉన్నారు కదా!'
రాష్ట్రంలో మహాగట్ బంధన్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి భయాందోళన వాతావరణం ఏర్పడిందని అమిత్ షా ఆరోపించారు. "బిహార్‌లో విభేదాలు సృష్టించడానికి నేను వస్తున్నానని లాలూ యాదవ్, నీతీశ్ కుమార్ అంటున్నారు. అంత అవసరం నాకు లేదు. ఎందుకంటే అందుకు మీరు ఉన్నారు కదా. అది సరిపోతుంది. మీ ప్రభుత్వం వచ్చాక భయపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు వచ్చాను" అని అన్నారు షా.
'2025లో బిహార్‌లో అధికారంలోకి భాజపా..'
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నీతీశ్ కుమార్ పార్టీకి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయని అమిత్ షా గుర్తుచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌ను బిహార్ ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. 2025 బిహార్ ఎన్నికల్లో భాజపా పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: మాజీ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట.. అవినీతి కేసు విచారణపై స్టే
'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా.. ఎన్నికలకు గాంధీ కుటుంబం దూరం'