దేశవ్యాప్తంగా 230 మందికి కేంద్ర భద్రతా బలగాలు వీఐపీ రక్షణ అందిస్తున్నాయని, వారిలో 40 మంది జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారని మంగళవారం కేంద్రం వెల్లడించింది. పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో టీఎంసీ నుంచి భాజపాలోకి వలసలు కొనసాగుతున్నాయి. అలా వచ్చిన వారిలో కొందరికి కేంద్రం రక్షణ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ మాలా రాయ్, కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్, డీఎంకేకి చెందిన గణేశ్ మూర్తి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు హోం మంత్రిత్వ శాఖ ఈ సమాధానమిచ్చింది. రాష్ట్రాల వారీగా రక్షణ పొందుతున్నవారి వివరాలు, వ్యయం గురించిన సమాచారాన్ని వెల్లడించేందుకు నిరాకరించింది.
'రాజ్యాంగం ప్రకారం.. పోలీసులు, శాంతి భద్రత రాష్ట్రాలకు చెందిన అంశాలు. ఒక వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ సమాచారాన్ని కేంద్రం పొందుపరచదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఏజెన్సీలు రక్షణ కల్పిస్తుండటం వల్ల ఆ వ్యయాన్ని అంచనా వేయలేం' అని హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
42 సంస్థలను నిషేధించాం
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే 42 సంస్థలపై భారత్‌లో నిషేధం ఉందని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. వాటిలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలున్నాయని తెలిపింది. సరిహద్దు వెంబడి వీటి కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని తెలిపింది. 2018 నుంచి 2020 మధ్య భద్రతా బలగాల చేతిలో 635 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించింది. అదే సమయంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా 115 మంది పౌరులు ప్రాణాలు వదిలారని పేర్కొంది.
ఇదీ చూడండి : బంగాల్ దంగల్: 'ఛాయ్'వాలాగా మారిన దీదీ