కరోనా నిర్ధరణ పరీక్షలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోకుండా భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగిన తర్వాత తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఒకవేళ విమానాశ్రయాల్లో ఆ మేరకు ఏర్పాట్లు లేకుంటే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ 14 రోజుల్లో ఏడు రోజులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ మరో 7 రోజులు ఇంట్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2 నాటి మార్గదర్శకాల స్థానంలో కొత్త వాటిని కేంద్రం జారీ చేసింది.
అంతర్జాతీయ ప్రయాణికులు అందరూ.. తమ ప్రయాణానికి కచ్చితంగా 72 గంటల ముందు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూడిల్లీఎయిర్‌పోర్ట్ డాట్ ఇన్ పోర్టల్ ద్వారా స్వీయధ్రువీకరణ పత్రం సమర్పించాలని లేదంటే విమానాశ్రయాల్లో దిగిన తర్వాత అక్కడి కౌంటర్లలో వ్యక్తిగతంగా అందించాలని కేంద్రం తెలిపింది. 14 రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు పాటిస్తామన్న లేఖను కూడా ఇవ్వాలని పేర్కొంది.
గర్భిణులుకు, పిల్లలకు, వృద్ధులకు, కుటుంబసభ్యులు మరణించిన వారికి మాత్రమే 14రోజుల హోం క్వారంటైన్ అనుమతి ఉంటుందని తెలిపింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికే వ్యవస్థాగత క్వారంటైన్ ఉండబోదని తెలిపింది.