అసోం శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఈసీ ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా సారథ్యంలోని అధికారుల బృందం సోమవారం నుంచి మూడు రోజులపాటు గువాహటిలో పర్యటించనుంది. 126 స్థానాలు కలిగిన అసోం శాసనసభకు మార్చి-ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేయనుంది.
ఈ పర్యటనలో వివిధ వర్గాలతో ఈసీ బృందం సమావేశం కానుంది. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రధాన అధికారి, పోలీస్ నోడల్ అధికారి సహా ఉన్నత స్థాయి అధికారులతో భేటీ అవుతుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ఎన్నికలతో సంబంధం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించి, అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం'