99.37 శాతం ఉత్తీర్ణత..
12వ తరగతి ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ). 99.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని పేర్కొంది. బాలురపై బాలికలే పైచేయి సాధించారని, 0.54 శాతం మేర బాలికలు అధికంగా ఉత్తీర్ణులైనట్లు వెల్లడించింది.
గత ఏడాది (88.78 శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 10 శాతం మేర పెరిగిందని పేర్కొంది సీబీఎస్ఈ. ఈ ఏడాది 70 వేల మందికిపైగా విద్యార్థులు 95శాతంకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైనట్లు వెల్లడించింది. మరో లక్షన్నర మందికిపైగా 90శాతం మార్కులు సాధించినట్లు తెలిపింది. మరో 65 వేల మంది విద్యార్థుల గ్రేడ్లు ఇంకా నిర్ణయించాల్సి ఉందని, వాటిని ఆగస్టు 5న ప్రకటిస్తామని తెలిపింది సీబీఎస్ఈ
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను cbse.nic.in, cbseresults.nic.in వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
టాలెంట్ పవర్ హౌస్‌లు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన క్రమంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. గత ఏడాది నుంచి విద్యా ప్రపంచంలో చాలా మార్పుల వచ్చాయని, వాటిని అందిపుచ్చుకొని గొప్ప ప్రదర్శన చేశారని కొనియాడారు. వారికోసం గొప్ప భవిష్యత్తు ఎదురుచూస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక టాలెంట్‌కు పవర్‌హౌస్‌లుగా అభివర్ణించారు.
వచ్చే వారంలో 10వ తరగతి ఫలితాలు!
12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన క్రమంలో.. 10వ తరగతి ఫలితాలపై కసరత్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు సీబీఎస్ఈ పరీక్షల అధికారి సన్యామ్ భరద్వాజ్. వచ్చే వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.