కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసే టీకా డోసుల సంఖ్య విడత విడతకూ తగ్గిపోతోంది. వ్యాక్సినేషన్ చరుగ్గా సాగేందుకు టీకాల సరఫరా మరింత పెరగాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఇచ్చే డోసులు తగ్గిపోతుండటం గమనార్హం. మే ఒకటో తేదీ నుంచి దేశంలో సరళీకృత టీకా విధానం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం.. దేశంలో తయారయ్యే టీకా డోసుల్లో 50 శాతం డోసులను కేంద్ర ప్రభుత్వమే సేకరించి వాటిని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయాలి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం..
- తొలి విడతలో (మే1-15) కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన డోసులు: 2,12,50,000
- రెండో విడతలో (మే16-31) కేటాయించినవి: 1,91,49,000
- మూడో విడతలో (జూన్1-15) కేటాయించినవి: 1,82,30,000
- తొలివిడత కేటాయింపుల కంటే రెండో విడతలో 21.01 లక్షల మేర టీకా డోసులు తగ్గాయి. మూడో విడతకు వచ్చే సరికి మొదటి విడత కంటే 30.20లక్షలు తగ్గిపోయాయి. మొత్తంగా రాష్ట్రాలకు ఈ మూడు దశల్లోనే 50లక్షలకు పైగా టీకా డోసులు తగ్గాయని స్పష్టమవుతోంది.
మరోవైపు.. జూన్ చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కొనుగోలు చేసే వాటా నుంచి 4,87,55,000 టీకా డోసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి: 'కనిష్ఠ స్థాయికి మోదీ ప్రతిష్ఠ'