ఒంటెను ఢీకొని బెంగళూరుకు చెందిన ప్రముఖ బైకర్ మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ బెంగళూరులో బైకర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల అతడు తన ముగ్గురు స్నేహితులో కలిసి బైక్‌పై రాజస్థాన్ పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలో జైసల్మేర్‌కు వెళ్తుండగా.. ఫతేగఢ్ వద్ద బుధవారం రాత్రి శ్రీనివాసన్ బైక్‌కు ఒంటె అడ్డువచ్చింది. దీంతో బైకు అదుపుతప్పి ఒంటెను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసన్ తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు గురువారం మృతదేహానికి పోస్టుమార్టం చేసి, అనంతరం అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.
శ్రీనివాసన్ గతంలో బైక్‌పైనే బెంగళూరు నుంచి బయలుదేరి ఐదు ఖండాల్లో 37 దేశాల్లో పర్యటించాడు. మొత్తంగా 65వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇటీవల అతడు బీఎండబ్ల్యూ జీఎస్ బైక్ కొనుగోలు చేశాడు. త్వరలో ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇంతలోనే శ్రీనివాసన్ మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చదవండి:సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్, నేపాల్ చర్చలు