Chopper crash black box: జనరల్ బిపిన్ రావత్‌ను బలితీసుకున్న హెలికాప్టర్‌కు సంబంధించిన 'బ్లాక్ బాక్స్' లభ్యమైన నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి దానిపైకి మళ్లింది. లోహవిహంగం పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఈ 'నిగూఢ పెట్టె' చెక్కుచెదరకుండా ఉంది. ప్రమాదానికి కారణాలను నిగ్గు తేల్చడంలో ఇది కీలక పాత్ర పోషించబోతోంది.
What is black box in helicopter?
విమానాలు, హెలికాప్టర్లలో బ్లాక్ బాక్స్ చాలా కీలకమైన ఎలక్ట్రానిక్ సాధనం. ఇందులోని పరికరాలు.. హెలికాప్టర్ వేగం, ప్రయాణిస్తున్న ఎత్తు, వాయు పీడనం సహా గగనయానానికి సంబంధించిన 88 కీలక పరామితులతోపాటు కాక్‌పిట్‌లో సాగే సంభాషణలను నమోదు చేస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణాలను గుర్తించడం ద్వారా భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా చూడటానికి ఈ డేటా కీలకమవుతుంది. వాణిజ్య, సైనిక లోహవిహంగాల్లో వీటి ఏర్పాటు తప్పనిసరి. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ 1950లలో తొలుత దీన్ని రూపొందించారు.
ఇదీ చూడండి: నేడు సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు
4 భాగాలు..
సాధారణంగా బ్లాక్‌బాక్స్ బరువు 4.5 కిలోలు ఉంటుంది. అందులో నాలుగు భాగాలుంటాయి.
- ఈ సాధనాన్ని హెలికాప్టర్‌లో స్థిరంగా పట్టి ఉంచడానికి చాసీ లేదా ఇంటర్‌ఫేస్.
- నీటిలో బ్లాక్‌బాక్స్ ఆచూకీని తెలిపే అండర్‌వాటర్ లొకేటర్ బీకన్.
- ప్రమాదాన్ని తట్టుకొని నిలబడే 'క్రాష్ సర్వైవబుల్ మెమరీ యూనిట్'. దీన్ని స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారు. తీవ్ర వేడి, శీతల వాతావరణం, నీరు కూడా దీన్ని ఏమీ చేయలేదు.
- సర్క్యూట్ బోర్డులు, వాటిపై చిన్నపాటి రికార్డింగ్ చిప్‌లు.
బ్లాక్ బాక్స్‌లో రెండు రకాల రికార్డర్లు ఉంటాయి.
1. Cockpit voice recorder: కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్).
2. Flight data recorder: ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్).
సీవీఆర్ పైలట్ మాటలు, కాక్‌పిట్‌లోని ధ్వనులను నమోదు చేస్తుంది. ఎఫ్‌డీఆర్‌లో లోహవిహంగానికి సంబంధించిన డేటా నిక్షిప్తమవుతుంది.
ఇదీ చూడండి: హెలికాప్టర్ క్రాష్‌పై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు: రాజ్‌నాథ్
డేటా వెలికితీత ఎలా?
ప్రమాదస్థలి నుంచి బ్లాక్‌బాక్స్‌ను సేకరించాక.. తొలుత దాని చుట్టూ ఉన్న రక్షణాత్మక పొరలను తొలగిస్తారు. ఆ తర్వాత చిప్‌ల నుంచి ఆడియో లేదా డేటాఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, కాపీ చేస్తారు.
డీ కోడింగ్ కీలకం
Spectral analysis black box: మొదట ఈ డేటాతో ఏమీ తెలియదు. సందేశ రూపంలో ఉండే ఫైల్స్‌ను డీకోడ్ చేయాలి. ఆ తర్వాత వాటిని గ్రాఫ్‌లుగా మార్చాలి. చిన్నపాటి శబ్దాలను వినడానికి 'స్పెక్ట్రల్ విశ్లేషణ'ను నిపుణులు సాగిస్తారు.
Black box colour: బ్లాక్ బాక్స్ నిజానికి నలుపు రంగులో ఉండదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ స్పష్టంగా కనిపించడం కోసం దీనికి నారింజ రంగు వేస్తారు.
ఇదీ చూడండి: అప్పట్లో శత్రు విమానాలను హడలెత్తించి.. ఇప్పుడిలా విగతజీవిగా...
డేటా ప్రాసెసింగ్..
Black box data processing: బ్లాక్‌బాక్స్ డేటాను విశ్లేషించడానికి రికార్డింగ్ స్టూడియో తరహాలో ఒక లిజనింగ్ రూమ్ ఉంటుంది. అందులో ఆడియో మిక్సింగ్, ప్లేబ్యాక్ సాధనాలు ఉంటాయి. ఇక్కడి సాధనాల్లోని నాలుగు ఛానళ్లు.. రికార్డింగ్‌లో నమోదైన ఇతరత్రా శబ్దాలను, మనుషుల మాటలను వేరు చేస్తాయి.
ఫలితం ఎప్పుడొస్తుంది?
ప్రాసెసింగ్ తరువాత గంటలు లేదా రోజుల్లోనే ప్రమాదానికి సంబంధించి ఒక అభిప్రాయానికి వస్తుంటారు. సాధారణంగా నెల తర్వాత మధ్యంతర నివేదిక, ఏడాది తర్వాత పూర్తిస్థాయి నివేదిక ఇస్తుంటారు.
ప్రమాదంతో ముడిపడిన రికార్డింగ్‌లు కావడం వల్ల వీటిని ఆలకించే సిబ్బంది కలవరానికి లోనుకాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తుంటారు.
ఇదీ చూడండి: Bipin Rawat: 'అగ్గిపెట్టె' సమాధానంతో ఆర్మీలో చేరిన రావత్..!