సీబీఎస్ఈ పన్నెండో తరగతి బోర్డు పరీక్షల(CBSE Class 12) నిర్వహణపై రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం.. సుప్రీంకోర్టుకు వెల్లడించింది. పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా... ఈ అంశంపై కేంద్రం తన వైఖరిని తెలిపింది.
పరీక్షలు నిర్వహించాలా? వద్దా అనే అంశంపై కేంద్రం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. దీనిపై తుది నిర్ణయాన్ని తెలిపేందుకు జూన్ 3 వరకు సమయమివ్వాలని ధర్మాసనాన్ని కోరారు.
అటార్నీ జనరల్ అభ్యర్థనకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. పరీక్షలపై(CBSE Class 12) నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని పేర్కొంది. అయితే గతేడాది విధానాన్ని పక్కనబెట్టాలని అనుకుంటే అందుకు తగిన కారణాలు చెప్పాలని ఆదేశించింది. అనంతరం విచారణ గురువారాని(జూన్ 3)కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి- 'సోలీ సొరాబ్జీ సేవలు మకుటాయమానం'