CBSE Accountancy Paper News: 12వ తరగతి అకౌంటెన్సీ ప్రశ్నాపత్రంలో తప్పులు ఉండటం వల్ల విద్యార్థులకు అదనంగా ఆరు మార్కులు కేటాయిస్తామంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య వార్తల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
"సీబీఎస్‌ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో చక్కర్లు కొట్టడం మా దృష్టికి వచ్చింది. డిసెంబరు 13న జరిగిన అకౌంటెన్సీ ప్రశ్నాపత్రంలో తప్పులు ఉండటం కారణంగా ఆరు మార్కులు విద్యార్థులకు కేటాయిస్తాం అని ఆడియోలో ఉంది." అని సీబీఎస్‌ఈ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఆడియోలో ఉన్న కంటెంట్ పూర్తిగా నిరాధారమైనవి, అసత్యమైనవని బోర్డు పేర్కొంది. సీబీఎస్‌ఈ బోర్టు అసలు ఇలాంటి నిర్ణయమే తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి నకిలీ వార్తల మాయలో పడొద్దని సూచించింది.
ఆడియోలో ఏముందంటే..?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోలో " విద్యార్థులారా బాధపడకండి. అకౌంటెన్సీ పేపర్లో మీరు 28 నుంచి 31 ప్రశ్నలకు సరైన సమాధానాలు అందిస్తే.. మీకు దాదాపు 38 మార్కులు వస్తాయి. సీబీఎస్‌ఈ అదనంగా ఆరు మార్కులు విద్యార్థులకు కేటాయిస్తుంది."అని ఉంది.
ఆంగ్ల ప్రశ్నాపత్రంపై రగడ..
పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ వ్యాసం వివాదానికి దారితీసిన తర్వాత.. ఇలాంటి ఆడియో వైరల్ కావడం గమనార్హం. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో 'మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి', 'భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది' వంటి అంశాలున్నాయి.
CBSE English Paper Controversy: ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో సీబీఎస్‌ఈ చర్యలు చేపట్టింది. 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష నుంచి కాంప్రహెన్షన్ ప్యాసేజీలోని ప్రశ్నలను తొలగించింది. విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తున్నట్టు ప్రకటించింది.
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా ఓ నిపుణుల బృందాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది.
ఇదీ చూడండి: CBSE English Paper Controversy: వివాదాస్పద ప్రశ్న తొలగించిన సీబీఎస్‌ఈ