CBN Bail Petition in ACB Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును.. అయిదు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ అనిశా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు.
Chandrababu Arrest in Skill Development Case: అరెస్టు అనంతరం పూర్తిస్థాయిలో విచారించడానికి సమయం లేదన్నారు. పోలీసు కస్టడీలో విచారణ చేస్తే తప్పేముందన్నారు. విచారణకు సహకరించాలని ఇద్దరికి నోటీసు ఇస్తే విదేశాలకు వెళ్లిపోయారన్నారు. షెల్ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరింది అనేది తేల్చాల్సి ఉందన్నారు. ఇది 371 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యవహారమన్నారు.
Chandrababu Bail Petition: వాస్తవాలు వెలికితీయాలంటే పోలీసు కస్టడీ విచారణ అవసరం అన్నారు. దర్యాప్తులో గ్యాప్‌లను వెలికి తీసేందుకు పోలీసు కస్టడీ అవసరం అన్నారు. ఓసారి జ్యుడీషియల్ రిమాండ్ కోరామన్న కారణంతో పోలీసు కస్టడీ కోరకూడదనే నిబంధన లేదన్నారు. అనిశా కోర్టుకు విచారణ పరిధి లేదంటూనే ఇక్కడే పిటిషన్లు దాఖలు చేస్తున్నారన్నారు.
ACB Court: అరెస్టు చేశాక హెలికాప్టర్‌లో విజయవాడ తీసుకెళ్తామని చెబితే చంద్రబాబు నిరాకరించి.. రోడ్డుమార్గానే వెళదామన్నారని తెలిపారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. 'చంద్రబాబుని అరెస్టు చేసి 24గంటల్లో కోర్టుముందు హాజరుపరచాల్సిన దర్యాప్తు అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా 36గంటలు వారివద్దే విచారణ నిమిత్తం ఉంచుకున్నారన్నారు.
ACB Court to Hear CBN Bail Petition: విచారణకు సంబంధించిన వీడియోలను ఎంపిక చేసుకున్న ఛానళ్లకు లీకులు ఇచ్చారని.. అవి ప్రజా బాహుళ్యంలో ఉన్నాయన్నారు. ఈనెల 10న అనిశా కోర్టులో చంద్రబాబుని హాజరుపరుస్తూ జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించాలని కోరారని.. ఒక్క రోజులో ఆలోచనను మార్చుకున్న దర్యాప్తు అధికారి 11వ తేదీన పోలీసు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారన్నారు.
Chandrababu in Jail: ఇలా ఒక్కరోజులోనే మాట మార్చడం వెనక దర్యాప్తు అధికారి దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టు అనుమతి కోరుతున్నారన్నారు. ఇప్పటికే సీఐడీ ప్రెస్‌మీట్లు పెట్టిందని.. చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లు వీడియోలను విడుదల చేసిందన్నారు. ఇలాంటి చర్యలన్నింటికీ సీఐడీ.. న్యాయస్థానానికి సమాధానం చెప్పాలన్నారు.
chandrababu Remand: కోర్టుతో సీఐడీ ఆటలాడుతోందని పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా చంద్రబాబుని ఈ కేసులో ఇరికించారని న్యాయవాది అన్నారు. ఆయన పాత్ర ఉంటే 2021 నుంచి దర్యాప్తు చేస్తున్న వారు ఇప్పటి వరకు ఒక్కసారైనా నోటీసు ఇవ్వలేదు, విచారణకు పిలవలేదన్నారు. రాత్రికిరాత్రే ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చి బస్సును చుట్టుముట్టి అరెస్టు చేశారని.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారన్నారు.
ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా ఇదంతా చేస్తున్నారని తెలిపారు. పలు కేసుల్లో చంద్రబాబుని నిందితుడిగా చేరుస్తున్నారని.. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా చంద్రబాబు వ్యవహారంలో దర్యాప్తు చేయడానికి వీల్లేదన్నారు. కేసుపెట్టి అరెస్టు చేయడానికి వీల్లేదని.. సీఐడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల విషయంలో 2021 డిసెంబర్ 09న సీఐడీ పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందన్నారు. ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేసిందని తెలిపారు. వారు బెయిలు పొందారని.. ఇప్పటి వరకు ఇతర నిందితులందరూ దర్యాప్తు సంస్థతోనే ఉన్నారని అన్నారు. దర్యాప్తునకు సహకరించారని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని.. అలాంటప్పుడు ఆయనను పోలీసు కస్టడీలో విచారించి తేల్చేదేముంటుందన్నారు.
యాంత్రిక ధోరణిలో పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని కోర్టుకు తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు కట్టడి చేయాలని తెలిపారు. ఈ కేసులో పోలీసు కస్టడీకి ఎందుకివ్వాలో.. సీఐడీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోతోందన్నారు.
కస్టడీ సూత్రాలకు లోబడి న్యాయస్థానం నిర్ణయించాలన్నారు. అంతేతప్ప ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే విషయంలో న్యాయస్థానం భాగస్వామి కాకూడదని పేర్కొన్నారు. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును నిందితుడిగా చేర్చామని చెబుతున్న సీఐడీ.. ఇప్పుడెందుకు పోలీసు కస్టడీ కోరుతోందన్నారు. ప్రశ్నించేందుకు తమకు అప్పగించాలని సీఐడీ చెబుతోందన్నారు.
ప్రశ్నించడం అనేది సీఐడీకి పుట్టుకతో వచ్చిన హక్కేమీ కాదని.. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారనేది 2021 నుంచి చేస్తున్న ఆరోపణ అయినా ఇప్పటివరకూ ఈ వ్యవహారాన్ని తేల్చలేదని తెలిపారు. దర్యాప్తులో తేడాలున్నాయని.. వాటిని సరిదిద్దుకోవాలి కాబట్టి పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ చెప్పడం హాస్యాస్పదమన్నారు.
న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్ 167 నిబంధనల మేరకు ఓసారి జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించిందని.. అదే నిబంధన ఆధారంగా పోలీసు కస్టడీకి ఆదేశించలేదన్నారు. చంద్రబాబును విచారిస్తున్న వీడియోలను తీసి ప్రతిష్ఠను దిగజార్చడానికే పోలీసు కస్టడీ కోరుతున్నారన్నారు. దర్యాప్తు అధికారి ఇప్పటికే వీడియోలను లీకు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు.
ఇలాంటి కేసులను వాస్తవానికి ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక న్యాయస్థానం విచారించాలని.. ఏసీబీ కోర్టుకు పరిధి లేదన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పోలీసు కస్టడీ పిటిషన్‌ను కొట్టేయాలని న్యాయవాదులు కోరారు. చంద్రబాబును ప్రశ్నిస్తున్న వీడియోలు బయటకు రావడంతో.. దానికి ఏం సమాధానం చెబుతారని న్యాయాధికారి ప్రశ్నించారు.
సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద బదులిస్తూ అవి నిరాధార ఆరోపణలన్నారు. వీడియోలు తీసింది ఎవరనేది ప్రశ్నార్థకం అన్నారు. చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, హెల్పర్లు, న్యాయవాదులు ఉన్నారన్నారు. ఆ వాదనపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపిక చేసుకున్న వ్యక్తుల ద్వారా సీఐడీ వీడియోలు తీయించిందన్నారు.
Chandrababu Arrest in Nandyal: వీడియోలో ఎవరున్నారనే విషయాలను పెన్‌డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేస్తామన్నారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టుచేసిన సందర్భంగా సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు.. సమాచారాన్ని ఎవరికి చేరవేశారో వెల్లడి కావాలంటే ఆ అధికారుల సెల్‌ఫోన్ కాల్ రికార్డులను భద్రపరచాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌లో కౌంటర్ వేయాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ చేస్తానన్నారు. మరోవైపు చంద్రబాబును ఇతర కేసుల్లో సీఐడీ నిందితుడిగా చేర్చి వాటిలో విచారించేందుకు అనుమతించాలని పీటీ వారంట్‌పై నేడు విచారణ చేస్తానని న్యాయాధికారి పేర్కొన్నారు.