CBI Enquiry Bhaskar Reddy and Uday Kumar Reddy: YS వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. రెండు రోజుల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించిన సీబీఐ అధికారులు.. ఆ ఇద్దరినీ సీబీఐ కోర్టు అనుమతితో ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈనెల 24 వరకు కస్టడీకి అనుమతించడంతో.. ఇద్దరినీ కస్టడీలోకి తీసుకొని.. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించనున్నారు. ఉదయం 9 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని.. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించనున్నారు. తర్వాత సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లి... ప్రశ్నించనున్నారు. ఇలా 6రోజుల పాటు చంచల్ గూడ జైలు నుంచి ఉదయం తీసుకొచ్చి... సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించి తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత..చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లనున్నారు.
మరోవైపు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు.. ఈ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సీబీఐ కార్యాలయానికి రావాలని.. నోటీసులు జారీ చేశారు. 160 C.R.P.C కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు... అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో సాక్షిగా ఇప్పటికే నాలుగు సార్లు.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. తాజాగా ఉదయ్ భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు.. అవినాష్ రెడ్డిని కలిపి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ.. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ముగ్గురికి వివేకానందరెడ్డి హత్యతో ఉన్న సంబంధాలు.., దానికి దారితీసిన పరిస్థితులపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
ఏదైనా కేసులో... ఒకరి కంటే ఎక్కువ మంది నిందితులను విచారించేటప్పుడు.. వారందర్నీ వేర్వేరుగా ప్రశ్నించడంతోపాటు కలిపి కూడా ప్రశ్నిస్తుంటారు. ఫలితంగా వారు చెప్పే అంశాల్లో.. నిజం ఎంత ఉందో అంచనా వేస్తారు. ఒకరు చెప్పినదాన్ని ఇంకొకరి జవాబులతో సరిపోల్చుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో.. విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఉదయ్ కుమార్ రెడ్డి.. అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని, మూడో వ్యక్తి నుంచి ఫోన్ రాగానే హత్యాస్థలికి బయల్దేరినట్లు.. సీబీఐ అధికారులు గుర్తించారు.
ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత అవినాష్ రెడ్డి తన వ్యక్తిగత సహాయకుడి ఫోన్ తో.. సీఐ శంకరయ్యకు ఫోన్ చేసి., వివేకా గుండె పోటుతో చనిపోయినట్లు సమాచారమిచ్చారని సీబీఐ అధికారుల దర్యాప్తులో తేలింది. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా.. రక్తపు వాంతులు చేసుకొని గుండెపోటుతో చనిపోయినట్లు అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ప్రచారం చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రి జయప్రకాష్ రెడ్డిని పిలిపించి వివేకా తలకు బ్యాండేజీ కట్టించినట్లు CBI దర్యాప్తులో తేలింది.
వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి వివేకా అంటే కోపమని., 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవడానికి భాస్కర్ రెడ్డి కుటుంబమే కారణమని.. దర్యాప్తులో తేలింది. ఆ మేరకు పలు సాక్ష్యాలు కూడా సేకరించినట్లు.. అధికారులు చెబుతున్నారు. వివేకా హత్య కోసం 40కోట్లు భాస్కర్ రెడ్డి సిద్ధం చేసి పెట్టుకున్నారని.., అంత డబ్బు ఎక్కడి నుంచి జమ చేయాలనుకున్నారనే విషయాలను... సీబీఐ తెలుసుకోవాల్సి ఉంది. వీటితోపాటు.. వివేకా హత్యను గుండె పోటు మరణంగా చిత్రీకరించేందుకు ఎందుకు ప్రయత్నించారనే విషయాలను నిందితుల నుంచి సీబీఐ అధికారులు సేకరించనున్నారు.
ఇవీ చదవండి: