Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో వేగం పెంచింది. కడప జిల్లా ఎంపీ అవినాష్‌రెడ్డి పులివెందులలోని నివాసగృహానికి సీబీఐ బృందం వెళ్లింది. పులివెందులలోని ఆయన నివాసానికి.. రెండు వాహనాల్లో సీబీఐ బృందం చేరుకోగా, మరో బృందం హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బంది మాత్రం అధికారులు ఎవరూ రాలేదని తెలిపారు. ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. నేడు మరోసారి ప్రశ్నించడానికి ఆయన నివాసానికి చేరుకుంది. అయితే సీబీఐ వెళ్లే సమయానికి పులివెందులలోని నివాసంలో ఎంపీ అవినాష్ రెడ్డి లేరు. ఆయన తండ్రి వెఎస్ భాస్కర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. దీంతో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సీబీఐ రాక గురించి తెలుసుకున్న అవినాష్ రెడ్డి అనుచరులు, అభిమానులు పులివెందులలోని నివాసానికి భారీగా చేరుకున్నారు. సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని వాహనంలో కడపకు తీసుకెళ్తున్న సమయంలో .. సీబీఐ అధికారులను అవినాష్ రెడ్డి అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అవినాష్ రెడ్డిని గతంలో విచారించిన సీబీఐ : కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించింది. రెండు రోజుల క్రితం అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ను సీబీఐ అరెస్టు చేసి, హైదరాబాదులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఉదయ్ కుమార్ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
హత్యలో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంటీ : ఉదయ్ కుమార్ రెడ్డిని కడపలో అరెస్టు చేసిన సీబీఐ, అతడ్ని విచారించింది. హత్య జరిగిన స్థలంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో ఇతర నిందితులతో కలిసి ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ వెల్లడించిది. దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన ఉదయ్‌ని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖాలు చేసింది. దర్యాప్తుకు సహకరించటం లేదని.. పలుమార్లు విచారించిన తెలిసిన వాస్తవాలపై మాట మారుస్తున్నారని, అంతేకాకుండా దాట వేసే సమాధానాలిస్తున్నారని కోర్టుకు తెలిపింది. ఇందువల్ల దర్యాప్తు కొనసాగించాలంటే 10 రోజుల కస్టడీ అవసరమని సీబీఐ కోర్టును అభ్యర్థించింది.
ఇవీ చదవండి :