CBI Notices to MP Avinash: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో విచారణకు రావాలని ఈ నెల 22న హాజరుకావాలని.. నోటీసుల్లో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. వాట్సప్ ద్వారా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. కడప ఎంపీ ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. ఈనెల 16, 19న సీబీఐ విచారణకు పిలువగా.. ఆఖరి నిమిషంలో విచారణకు రాలేనంటూ లేఖలు రాశారు. కర్నూలు విశ్వ శాంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లితో పాటు అవినాష్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ మరోసారి దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చింది.
విచారణకు పిలిస్తే సాకులే: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచినప్పుడల్లా సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే అవినాష్ అరెస్టుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయో.. అప్పటి నుంచి విచారణకు పిలిస్తే హాజరుకాకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఆయన అలా డుమ్మా కొట్టారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున సీబీఐ పిలిచిన తేదీల్లో రాలేనంటూ విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తన తల్లి గుండెపోటుకు గురైనందున విచారణకు హాజరుకాలేనంటూ న్యాయవాది ద్వారా సీబీఐకి చివరి నిమిషంలో సమాచారం పంపారు. చివరి క్షణంలో విచారణకు వెళ్లకుండా ఆగిపోవటం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. కేసు దర్యాప్తు జాప్యమయ్యేలా, అరెస్టు కాకుండా వీలైనన్ని ఎక్కువ రోజులు తాత్సారం చేసేందుకే అవినాష్‌రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడు నిందితులు విచారణకు హాజరవుతారు. అవినాష్ మాత్రం ఆయన అనుకున్నప్పుడే విచారణకు వెళ్తున్నారు.
అరెస్టు చేస్తారనే అనుమానం వచ్చిన ప్రతిసారీ: సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని అనుమానం వచ్చిన ప్రతిసారీ అవినాష్ రెడ్డి వివిధ రూపాల్లో దాన్ని అడ్డుకునేందుకే ప్రయత్నించారు.
జనవరి 28, ఫిబ్రవరి 24వ తేదీల్లో అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు మార్చి 10న విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు మరోసారి నోటీసులిచ్చారు. ఓ వైపు విచారణకు హాజరవుతూనే మరోవైపు తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అవినాష్‌ను ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారికి న్యాయస్థానం నుంచి పిలుపు రావటంతో విచారణను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. మార్చి 13 వరకూ అరెస్టు చేయొద్దంటూ అప్పట్లో హైకోర్టు తీర్పిచ్చింది.
అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఏప్రిల్ 14న, అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 17న విచారణకు హాజరుకావాలంటూ అవినాష్‌కు నోటీసులిచ్చారు. సీబీఐ విచారణకు హాజరవుతూనే ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దాని విచారణ సందర్భంగా అవసరమైతే అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామని సీబీఐ న్యాయస్థానానికి నివేదించింది. 18వ తేదీ సాయంత్రం వరకూ అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవొద్దంటూ న్యాయస్థానం తొలుత సీబీఐ అధికారులను ఆదేశించింది. అవినాష్‌ను 25 వరకూ అరెస్టు చేయొద్దని, ఆయన అప్పటి వరకూ రోజూ సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతారని అదే నెల 18న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో అవినాష్‌ను సీబీఐ విచారించింది.
అవినాష్ అరెస్టు విషయంలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదని, ఆ ఆదేశాలు అమల్లో ఉండటానికి వీల్లేదని ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో ఆయన అరెస్టుకు న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అవినాష్‌ను విచారణ కోసం రెండుసార్లు సీబీఐ పిలిపించగా.. రెండుసార్లూ ఆయన గైర్హాజరవడం గమనార్హం.
ఇవీ చదవండి: