CBI on YS Bhaskar Reddy and Uday Kumar Reddy Custody Petitions: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో YS భాస్కరరెడ్డి, మరో నిందితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని 10రోజుల కస్టడీకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న సీబీఐ.. ఈ మేరకు హైదరాబాద్‌లోని కోర్టులో గట్టి వాదనలు వినిపించింది. వివేకాతో.. భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డికి రాజకీయంగా విభేదాలున్నాయని తెలిపింది. హత్య కుట్రలో వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలది కీలక పాత్రని, వారిద్దరూ దగ్గరుండి సాక్ష్యాలను చెరిపేయించడమేగాక, సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారని.. సీబీఐ వెల్లడించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి.. భాస్కరరెడ్డితో పాటు శివశంకర్‌రెడ్డి కృషి చేశారన్న సీబీఐ.. దీనిపై వివేకా ఆగ్రహంతో ఉండేవారని పేర్కొన్నారు.
రాజకీయంగా... వివేకాను అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే కుట్ర జరిగిందని.. వివరించింది. ఈ సందర్భంగా అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్నీ ప్రస్తావించింది. వివేకా గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారని.. వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కట్టుకథ అల్లారని సీబీఐ తేల్చిచెప్పింది. వివేకా హత్య గురించి బాహ్యప్రపంచకం కన్నా ముందు ఉదయ్‌కు తెలుసని... ఆరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఉదయ్... కాటన్, బ్యాండేజ్ ఏర్పాటు చేసి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న తండ్రి గజ్జల జయప్రకాశ్‌రెడ్డిని వివేకా ఇంటికి పిలిపించినట్లు.. సీబీఐ స్పష్టం చేసింది.
శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూచనల మేరకు జయప్రకాశ్‌రెడ్డి వివేకాకు కట్టు కట్టి గాయాలు కప్పిపెట్టారని తేలింది. మృతదేహాన్ని.. ఫ్రీజర్ బాక్సులో పెట్టి, పూలతో అలంకరించి.. గుండెపోటుతో చనిపోయినట్లు సందర్శకుల్ని ఉదయ్ నమ్మబలికినట్లు వెల్లడించారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి.. కీలక సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని,.. దర్యాప్తునకు సహకరించకపోగా ఎగవేత సమాధానాలు చెప్పారని... CBI కోర్టుకు తెలిపింది .
మరోవైపు నిందితులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. సీబీఐ కొందరినే లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేస్తోందని.. YSభాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఈ మేరకు.. ఇ్దదరూ వేర్వేరుగా వాదనలు వినిపించారు. ఇష్టం వచ్చినవారిని అరెస్టు చేస్తోందని,.. ఇంకెవరిని అరెస్టు చేస్తుందోనని ఆందోళన ఉందని వాదించారు. ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఉన్న సాక్షుల గురించి కనీసం ప్రస్తావించడంలేదని, అసలు నిందితుల్ని పట్టుకోకుండా.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. నిందితులు ఇప్పటికే తమకు తెలిసిన సమాచారం అంతటినీ సీబీఐకి చెప్పినందున.... ప్రత్యేకంగా కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు. రిమాండు పిటిషన్‌లోని అంశాలనే కస్టడీ పిటిషన్లోనూ పేర్కొన్నారని అసలు కస్టడీ ఎందుకు అవసరమో.. చెప్పలేదన్నారు. 75 ఏళ్ల వృద్ధుడైన భాస్కరరెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచారని,.. విచారణకు సహకరించలేదనే ఆరోపణలు తప్ప.. ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదో స్పష్టత లేదని తెలిపారు.
సీబీఐ మొదటి రెండు అభియోగపత్రాల్లో... భాస్కరరెడ్డి ప్రస్తావన లేదని, తప్పుడు సాక్ష్యాలతో సీబీఐ ఇరికించే ప్రయత్నం చేస్తోందని.. ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన సమయం దగ్గర పడుతోందనే అరెస్టులు చేస్తున్నారు తప్ప, ఆధారాలను సేకరించడం లేదని ఆరోపించారు. ఉదయ్‌పై అభియోగాలన్నీ బెయిలు ఇవ్వదగినవే అయినందున సీబీఐ కస్టడీ పిటిషన్‌ను కొట్టేసి బెయిలు ఇవ్వాలన్నారు. ఇరుపక్షాల.. వాదనలు విన్న కోర్టు.. నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: