Custodial Death: అది ఏప్రిల్ 18వ తేదీ.. సోమవారం. చైన్నె సెక్రటేరియట్ కాలనీలోని ఓ రహదారిని పోలీసులు జల్లెడ పడుతుండగా.. వారికి ఆటోలో అనుమానాస్పదంగా వెళ్తున్న విఘ్నేశ్, సురేష్ అనే ఇద్దరు యువకులు కనిపించారు. వాహనాన్ని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి, అక్రమ మద్యం బయటపడింది. దీనిపై.. యువకుల్ని పోలీసులు ప్రశ్నించగా, సంబంధంలేని సమాధానాలు రావడం వల్ల అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన మర్నాడే పోలీసుల అదుపులో ఉన్న విఘ్నేశ్ కడుపు నొప్పి, వాంతులతో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతీయ ఎస్టీ కమిషన్ సమన్లు జారీ చేసే స్థాయికి వెళ్లింది.
విఘ్నేశ్ మృతిపై స్వయంగా స్పందించిన.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ ఘటనపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఘటనకు కారణాలను బయటకు లాగడం ప్రారంభించారు. ఈ క్రమంలో విఘ్నేశ్ మృత దేహాన్ని పోస్టుమార్టంకు పంపగా.. కీలక విషయాలు బయటపడ్డాయి. మృతుడి శరీరంపై 13 గాయాలతోపాటు తలపై సెంటీ మీటర్ లోతున దెబ్బ ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. విఘ్నేశ్ చెయ్యి విరిగి ఉండటాన్ని కూడా సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సెక్రటేరియట్ కాలనీ పోలీసు స్టేషన్ ఎస్ఐ, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తం 9మందిని సస్పెండ్ చేశారు. విఘ్నేశ్ కస్టడీ మృతికి సంబంధించి ఆ 9మందికి సీఐడీ సమన్లు జారీ చేసింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం తాజాగా సెక్రటేరియట్ పోలీసు స్టేషన్‌లోని రైటర్ మునాఫ్, గార్డు పొన్‌రాజ్‌ను అరెస్టు చేసింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: జననాంగాలను కొరికి వ్యక్తి హత్య.. షాక్లో పోలీసులు!