అవినీతి ఆరోపణలపై బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టయిన వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి గానీ.. తప్పు చేయడానికి గానీ మద్దతు తెలపనని స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేసినట్లు దోషిగా తేలితే వారు తప్పకుండా శిక్షపడాలని పేర్కొన్నారు. ఛటర్జీ అరెస్టు విషయంలో తనపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తున్నట్లు మమత బెనర్జీ వెల్లడించారు. నిజం ఎప్పటికైనా బయటికి రావాలని కానీ దానికి ఒక కాలవ్యవధి ఉండాలని మమత పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తన పార్టీని విచ్ఛిన్నం చేయాలని భాజపా భావిస్తే అది తప్పు అని దీదీ అన్నారు.
టీచర్ ఉద్యోగాల కుంభకోణంలో అరెస్టయిన బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీకి ఆస్పత్రిలో చేరాల్సినంత అవసరం లేదని.. భువేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. అవి ఆస్పత్రిలో చేరేంత ప్రమాదకరంగా లేవని తేల్చిచెప్పారు. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఆదేశానుసారం ఈడీ ఆధికారులు ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిర్ అంబులెన్స్ సాయంతో బంగాల్ నుంచి భువనేశ్వర్‌లో ఉన్న ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రికి పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు.. తీవ్రమైన అనారోగ్య సమస్యలేమి లేవని తేల్చి చెప్పారు.
ఆ డబ్బంతా మంత్రిదే: ఇంట్లో రూ.20కోట్ల నగదుతో పట్టుబడ్డ బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ ఆ డబ్బంతా మంత్రిదే అని అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. తన ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకొని విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అర్పిత వాగ్మూలం ఇచ్చింది. కాగా తన ఇంట్లో లభించిన ఆ డబ్బంతా మంత్రి ఛటర్జీదేనని అర్పితా ముఖర్జీ ఒప్పుకొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ డబ్బంతా ఒకటి, రెండు రోజుల్లో వేరే ప్రాంతానికి తరలించాలని ప్రణాళిక వేసుకుంటున్న సమయంలోనే దొరికిపోయినట్లు అర్పిత వెల్లడించినట్లు పేర్కొన్నాయి.
బంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈడీ అధికారులు మంత్రి, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కాగా, అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిందేనని భావిస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈనేపథ్యంలో అర్పితతోపాటు మంత్రిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవకతవకలకు సంబంధించి బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని ఈడీ కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రెండు రోజుల పాటు కస్టడీ విధించింది.
ఇవీ చదవండి: 'అధికారం కోసమే రాజకీయాలా?.. వదిలేయాలని అనిపిస్తోంది'
పాయింట్ వచ్చినా.. ప్రాణం పోయింది.. కబడ్డీ ఆడుతూ క్రీడాకారుడు మృతి